LIC: 'జీవన్ ఉత్సవ్' సింగిల్ ప్రీమియం ప్లాన్ లాంచ్ చేసిన ఎల్ఐసీ

by S Gopi |   (  Updated:2026-01-06 14:06:04  IST  )

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త ఏడాది ప్రారంభంలోనే రెండు కీలక కార్యక్రమాలను చేపట్టింది

LIC: జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ లాంచ్ చేసిన ఎల్ఐసీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కొత్త ఏడాది ప్రారంభంలోనే రెండు కీలక కార్యక్రమాలను చేపట్టింది. సరికొత్త బీమా పాలసీని తీసుకురావడంతో పాటు, గడువు ముగిసిన పాలసీల పునరుద్ధరణ కోసం ప్రత్యేక క్యాంపెయిన్‌ని కూడా ప్రారంభించింది. కొత్త పాలసీకి సంబంధించి 'జీవన్ ఉత్సవ్ ' పేరుతో సింగిల్ ప్రీమియం ప్లాన్‌ను ఎల్ఐసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జనవరి 12 నుంచి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చని, ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్‌లింక్డ్‌, ఇండివిడ్యువల్‌, సేవింగ్స్‌, పూర్తి జీవితకాలానికి బీమా అందించే ప్లాన్‌. ప్రస్తుతానికి ఎల్ఐసీ ఈ పాలసీ ప్రీమియం, ఇతర వివరాలను వెల్లడించలేదు. గతంలో ఇదే పేరుతో తెచ్చిన పాలసీకి మార్పులు చెసి, సింగిల్ ప్రీమియంగా తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ పాలసీని తీసుకుంటే జీవితాంతం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. గతేడాది, ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్, ఎల్ఐసీ బీమా కవచ్, ఎల్ఐసీ జన్ సురక్షన్–ప్లాన్, ఎల్ఐసీ బీమా లక్ష్మి, ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్ ప్లాన్ వంటి పాలసీలను తీసుకొచ్చింది.

ప్రత్యేక క్యాంపెయిన్

గడువు ముగిసి లాప్స్ అయిన తమ బీమా పాలసీలను పునరుద్ధరించేందుకు ప్రత్యేక రెండు నెలల క్యాంపెయిన్‌ను ఎల్ఐసీ ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ జనవరి 1 నుంచి మార్చి 2 వరకు కొనసాగుతుంది. పాలసీదారులు తమ బీమా ప్రీమియంలను సమయానికి చెల్లించకుండా వదిలేసిన పాలసీలను రివైవ్ చేసుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఈ పథకం కింద, ఎల్ఐసీ అనేక నాన్-లింక్డ్ పాలసీలకు ఆలస్య రుసుముపై తగ్గింపును అందిస్తోంది. పాలసీదారులు ఆలస్య రుసుముపై గరిష్టంగా రూ. 5,000 తగ్గింపుతో, 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల కోసం, ఎల్ఐసీ ఆలస్య రుసుములను 100% మాఫీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అయితే, గడువు ముగిసినప్పటికీ, ప్రీమియం చెల్లింపు కాలవ్యవధి మిగిలి ఉన్న పాలసీలను మాత్రమే ఈ క్యాంపెయిన్ ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. అయితే, పునరుద్ధరణకు వైద్య, ఆరోగ్య పరీక్షలు అవసరమైతే, వాటిలో ఎలాంటి సడలింపు ఉండదు.

Next Story