LIC: పెహల్‌గామ్ బాధితులకు ఎల్ఐసీ భరోసా.. వేగంగా క్లెయిమ్ ప్రక్రియ

by S Gopi |

టెర్రరిస్టుల దాడిలో అమాయక పౌరులు మరణించడం పట్ల ఎల్ఐసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

LIC: పెహల్‌గామ్ బాధితులకు ఎల్ఐసీ భరోసా.. వేగంగా క్లెయిమ్ ప్రక్రియ
X

దిశ, బిజినెస్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. టెర్రరిస్టుల దాడిలో అమాయక పౌరులు మరణించడం పట్ల ఎల్ఐసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో మృతుల డెత్ క్లెయిమ్‌ల ప్రక్రియను వీలైనంత వేగంగా, సులభంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎల్ఐసీ సీఈఓ, ఎండీ సిద్ధార్థ మొహంతి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. బాధలో ఉన్న కుటుంబాలకు అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చారు. డెత్ క్లెయిమ్‌ల ప్రక్రియ ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుందని, క్లెయిమ్ చేసే నామినీలు పాలసీదారు మరణానికి సంబంధించిన పత్రాలతో ఎల్ఐసీ బ్రాంచులో సంప్రదించాలని సంస్థ ప్రకటనలో తెలిపింది. బాధిత కుటుంబాలకు క్లెయిమ్‌లు త్వరితగతిన పరిష్కారమవుతాయి. ఈ నిర్ణయం ద్వారా బాధిత కుటుంబాలకు కొంతైనా ఊరట అందించాలని భావిస్తున్నట్టు ఎల్ఐసీ పేర్కొంది.

Next Story