Jiohotstar: 30 కోట్లకు చేరిన జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు

by S Gopi |

ఓటీటీ విభాగంలో ఆధిపత్యం కలిగిన నెట్‌ఫ్లిక్స్ కంటే కొంచెం తక్కువ కస్టమర్లతో జియోహాట్‌స్టార్ వెనుకబడి ఉంది.

Jiohotstar: 30 కోట్లకు చేరిన జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ రిలయన్స్ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ అరుదైన రికార్డును నమోదు చేసింది. జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనం జరిగిన నాలుగు నెలల వ్యవధిలోనే 30 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సాధించడం ద్వారా కీలక మైలురాయిని సాధించింది. అంతేకాకుండా ఓటీటీ విభాగంలో ఆధిపత్యం కలిగిన నెట్‌ఫ్లిక్స్ కంటే కొంచెం తక్కువ కస్టమర్లతో జియోహాట్‌స్టార్ వెనుకబడి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌కు మొత్తం 30.16 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నాయి. అయితే, జియోహాట్‌స్టార్‌కు ఐపీఎల్ సీజన్ కారణంగా భారీ సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరారని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జియోహాట్‌స్టార్‌కు 5 కోట్ల మంది మాత్రమే సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ సమయంలో ఏకంగా 20 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. అలాగే, టీ20 టోర్నమెంట్ సమయంలో మరో కోటి మంది పెరిగారు. ఐపీఎల్ సమయంలో వ్యూయర్‌షిప్ పరంగా కూడా జియోహాట్‌స్టార్ రికార్డులు నమోదు చేసింది. టీవీ మాధ్యమంలో 53.7 కోట్ల మంది, డిజిటల్‌గా 65.2 కోట్ల మంది ఐపీఎల్‌ను చూశారు. అత్యధికంగా జూన్ 3న జరిగిన ఆర్‌సీబీ, పంజాబ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 23.7 కోట్ల మంది చూశారు. టీవీలోనూ 18.9 కోట్ల మంది చూశారు. గతేడాదితో పోలిస్తే వ్యూయర్‌షిప్ ఏకంగా 87 శాతం పెరగడం విశేషం.

Next Story