Jio: 5జీ నెట్‌వర్క్ సేవల్లో జియో అగ్రస్థానం

by S Gopi |

5జీ డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 199.7 ఎంబీపీఎస్ గా ఉంది. ఇది కంపెనీ 4జీ డౌన్‌లోడ్ వేగం కంటే 11 రెట్లు ఎక్కువ.

Jio: 5జీ నెట్‌వర్క్ సేవల్లో జియో అగ్రస్థానం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ స్పీడ్, సిగ్నల్ లభ్యత, సబ్‌స్క్రైబర్ల వినియోగానికి సంబంధించి దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో 5జీ విభాగంలో అగ్రస్థానంలో ఉందని బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పరిశోధన సంస్థ ఓపెన్ సిగ్నల్ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య సేకరించిన డేటా ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 4జీ నుంచి 5జీకి మారడం వల్ల డౌన్‌లోడ్ స్పీడ్ అనేక రెట్లు పెరిగిందని, మరింత మెరుగైన ఇంటర్నెట్ లభిస్తున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం, సమీక్షించిన కాలంలో 5జీ డౌన్‌లోడ్ స్పీడ్ సెకనుకు 199.7 మెగాబిట్స్ (ఎంబీపీఎస్)గా ఉంది. ఇది కంపెనీ నెట్‌వర్క్‌లోని 4జీ డౌన్‌లోడ్ వేగం కంటే 11 రెట్లు ఎక్కువ. భారతీ ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 5జీ నెట్‌వర్క్ స్పీడ్ 187.2 ఎంబీపీఎస్ ఉండగా, ఇది 4జీ కంటే 7 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే వొడాఫోన్ ఐడియా 5జీ నెట్‌వర్క్ 138.1 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ నమోదు చేసింది. అన్ని టెలికాం కంపెనీలకు చెందిన 5జీ సబ్‌స్క్రైబర్లు 4జీతో పోలిస్తే తక్కువ నెట్‌వర్క్ అంతరాయాలు, తక్కువ ఇబ్బందిని ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఇది 5జీ నెట్‌వర్క్ నాణ్యత కేవలం అధిక స్పీడ్ అందించడమే కాకుండా, మరింత మెరుగైన రోజువారీ నెట్‌వర్క్, ఇంటర్నెట్ అనుభవాన్ని అందించడంలో కూడా ముందుందని నివేదిక పేర్కొంది.

Next Story