మళ్లీ పెళ్లి చేసుకున్న జెఫ్ బెజోస్.. ఫస్ట్ ఫొటో నెట్టింట హల్‌చల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-28 03:12:45  IST  )

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

మళ్లీ పెళ్లి చేసుకున్న జెఫ్ బెజోస్.. ఫస్ట్ ఫొటో నెట్టింట హల్‌చల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు జర్నలిస్ట్ లారెన్‌ శాంచెజ్‌ (Lauren Sanchez)ను ఇటలీలోని వెనిస్ నగరంలో శాన్ జార్జియో మాజియోరే ద్వీపంలో కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య ఎంతో ఆడంబరంగా వివాహమాడారు. జూన్ 24 నుంచి జూన్ 26 వరకు మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్‌ కుష్నెర్‌, ప్రముఖ జర్నలిస్ట్‌ ఓప్రా విన్‌ఫ్రే, కిమ్‌ కర్దాషియన్‌, కోలే కర్దాషియన్‌, జోర్డాన్‌ రాణి రనియా తదితరులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం లారెన్ శాంచెజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 'Lauren Sánchez Bezos'గా మార్చుకుని, తమ తొలి దాంపత్య ఫొటోను షేర్ చేశారు. ఫొటోలో వైట్ కలర్ లేస్ గౌన్‌లో లారెన్‌ చిరునవ్వుతో మెరిసిపోగా, బెజోస్‌ నల్ల టక్సీడోలో అలరించారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

కాగా, ఇదే సమయంలో ఈ పెళ్లి వేడుకను వ్యతిరేకిస్తూ స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు (Protests in Venice) వ్యక్తం అయ్యాయి. 'No Kings, No Bezos'అనే నినాదాన్ని సెయింట్ మార్క్ టవర్‌పై ప్రదర్శించగా, 'Tax Billionaires' అనే ప్లకార్డులు నగర వీధుల్లో కనిపించాయి. మూడు రోజులపాటు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయని, బిలియనీర్ల ప్రైవేట్ జెట్లు, యాచులు వల్ల కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయని ఆందోళనలకు చేపట్టారు

ఇక ఇదిలా ఉంటే, నగరానికి ఈ పెళ్లి వేడుక వల్ల భారీ ప్రయోజనం లభిస్తోందని ఇటలీ టూరిజం శాఖ ప్రకటించింది. పెళ్లి వల్ల వస్తున్న మీడియా ప్రచారం వల్ల దాదాపు 895 మిలియన్ల యూరోల వ్యాపార విలువ లభిస్తుందని అంచనా. జెఫ్‌ బెజోస్‌ కూడా నగరానికి 3 మిలియన్ల యూరోలు విరాళాన్ని ప్రకటించారు. దీంతో పాటు స్థానిక కళాకారులు తయారు చేసిన గిఫ్ట్ బాగ్స్, మురానో గాజు వస్తువులు, 19వ శతాబ్దపు బిస్కెట్లు వంటి ప్రత్యేక వస్తువులు వేడుకను మరింత విశిష్టంగా మార్చాయి. వెనిస్‌కు ఇది మరో జార్జ్ క్లోనీ తరహా స్టార్‌ పెళ్లిగా మిగిలిపోతుంది.

జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos), లారెన్‌లు 2018 నుంచే డేటింగ్‌లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. మెకంజీతో ఆయనకు నలుగురు సంతానం ఉన్నారు. 2023లో బెజోస్‌, లారెన్‌ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సందర్భంగా 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని ఆమెకు ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

Next Story