భారత్‌లో చిప్‌ల తయారీకి ఇజ్రాయెల్ టవర్ కంపెనీ ఆసక్తి

by Dishanational1 |
భారత్‌లో చిప్‌ల తయారీకి ఇజ్రాయెల్ టవర్ కంపెనీ ఆసక్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో చిప్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్ ఆసక్తిగా ఉంది. దాదాపు 8 బిలియన్ డాలర్ల(రూ. 66 వేల కోట్లకు పైనే)తో ఈ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించినట్టు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం కథనంలో పేర్కొంది. టవర్ కంపెనీ తన ప్లాంటు ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను కోరుతూ, దేశంలో 65 నానోమీటర్లు, 40 నానోమీటర్ చిప్‌లను తయారు చేయాలని భావిస్తోంది. 2022లోనే టవర్ సెమీకండక్టర్ భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ సెమీకండక్టర్ కన్సార్టియం(ఐఎస్ఎంసీ) భారత సెమీకండక్టర్ పథకంలో భాగమయ్యేందుకు దరఖాస్తు చేసింది. ఆ సమయంలో టవర్ సెమీకండక్టర్‌ను గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అయితే, పలు కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా టవర్ సెమీకండక్టర్ సొంతంగానే భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి ఆసక్తి చూపిస్తోంది. ఇజ్రాయెల్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీ అంతర్జాతీయ ఆటో, మెడికల్, ఇండస్ట్రియల్, కన్స్యూమర్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి రంగాల్లో 300 కంటే ఎక్కువ కంపెనీలకు అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌లను తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా కంపెనీ ఆదాయం 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఉండొచ్చు. కాగా, ఇప్పటికే దేశంలో చిప్‌ల తయారీకి అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీ గతేడాది జూన్‌లో కొత్త అసెంబ్లీ, టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు 825 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed