ఆరోగ్య బీమా పాలసీ ధరలను తగ్గించే అవకాశాలను అన్వేషించాలి: ఐఆర్‌డీఏఐ ఛైర్మన్!

by Disha Web Desk 7 |
ఆరోగ్య బీమా పాలసీ ధరలను తగ్గించే అవకాశాలను అన్వేషించాలి: ఐఆర్‌డీఏఐ ఛైర్మన్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఉన్న వివిధ ఆరోగ్య బీమా పాలసీల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల సమాజంలోని అందరికీ ఇవి అందుబాటులో లేకుండా పోయాయని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దెబాసిష్ పాండా అభిప్రాయపడ్డారు. మంగళవారం 'హెల్త్ ఇన్సూరెన్స్ సమ్మిట్-2022' కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఆరోగ్య బీమా పథకాలను సరసమైనవిగా మార్చాలని సూచించారు. అధిక నిర్వహణ, పంపిణీ ఖర్చుల వల్ల చాలామందికి ఆరోగ్య బీమా ఖరీదైన వ్యవహారంగా ఉందని, దీనికోసం పరోక్ష ఖర్చులను తగ్గించడానికి, బీమా ఎక్కువమందికి చేరవేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

ఆరోగ్య బీమా కవరేజీ భరించలేని ధరల్లో ఉన్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషించి పాలసీలను సరసమైన ధరలో అందించాలన్నారు. దీనికి అధునాత టెక్నాలజీ పరిష్కారాలను రూపొందించి, పరిశ్రమ డిమాండ్‌కు అనుగుణంగా ఖర్చుల నిర్వహణను పరిమితం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని దెబాసిష్ వివరించారు. ప్రజలు ఇతర వినియోగ ఖర్చులను ఎదుర్కొంటున్న కారణంగా ఖరీదైన ఆరోగ్య బీమా తీసుకునేందుకు సంకోచిస్తున్నారు. దీనికోసం పరిశ్రమలోని కంపెనీలు పాకెట్-ఫ్రెండ్లీ పాలసీలను అందించాలన్నారు. దేశంలో బీమా సౌకర్యాలను పెంచేందుకు ఐఆర్‌డీఏఐ చేయగలిగినంతా చేస్తోందని, పాలసీల అమ్మకాలు, క్లెయిమ్‌ల పరిష్కారం కోసం ఆరోగ్య బీమా రంగంలో మెరుగైన టెక్నాలజీని ఉపయోగిస్తోందని దెబాసిష్ వెల్లడించారు.

Next Story

Most Viewed