12 లక్షల రియాల్స్‌కు పడిపోయిన ఇరాన్ కరెన్సీ

by Muthe.Rajitha |

ఇరాన్ రియాల్ కరెన్సీ దారుణంగా పతనమైంది.

12 లక్షల రియాల్స్‌కు పడిపోయిన ఇరాన్ కరెన్సీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్ రియాల్ కరెన్సీ దారుణంగా పతనమైంది. 1 డాలర్‌ విలువ 12 లక్షల రియాల్స్ (1.2 మిలియన్ IRR)కు పడిపోయింది. ఇది దేశ ఆర్థికవ్యవస్థను మరింత అతలాకుతలం చేయనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌తో ముడి చమురు వ్యాపారం చేస్తోన్న సంస్థలపై, చైనాకు డిస్కౌంట్‌కు విక్రయిస్తోన్న చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత దిగజారింది. సెప్టెంబర్‌లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్‌పై అణు ఆంక్షలను పునరుద్ధరించడంతో విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు స్తంభించిపోయాయి. రియాల్ భారీగా పడిపోవడంతో ప్రజల జీవన ప్రమాణాలు పాతాళానికి పడిపోయాయి.

మాంసం, బియ్యం, ఇతర నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో అవినీతి, అసమర్థ పాలన సమస్యలు వేధిస్తున్నాయి. పవర్ గ్రిడ్‌లు కుప్పకూలడంతో దేశంలో గంటలపాటు పవర్ బ్లాక్‌అవుట్‌లు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. భారీ స్థాయిలో సహజవాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన రంగాన్ని సిద్ధం చేయలేకపోవడంతో కీలక సమయాల్లో ఇంధన కొరత ఏర్పడుతోంది.

కాగా 2015లో అగ్రరాజ్యం అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే నాటికి ఒక డాలర్‌కు 32 వేల రియాల్స్ ఉండేవి. కానీ 2018లో ట్రంప్ ఆ ఒప్పందం నుంచి బయటకు వచ్చి మళ్లీ చర్చలు మొదలుపెట్టినప్పటికీ అవి నిలిచిపోవడంతో రియాల్ విలువ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నాటికి 7.03 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు 12 లక్షలకు దిగజారి ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

Next Story