Tech: సర్క్యూట్ బోర్డ్ సరఫరాను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం

by S Gopi |

స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు వంటి పరికరాల్లో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీ) తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాల సరఫరా అంతరాయం కారణంగా ధరలు గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Tech: సర్క్యూట్ బోర్డ్ సరఫరాను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఏఐ సర్వర్లు వంటి పరికరాల్లో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీ) తయారీకి అవసరమైన కీలక ముడి పదార్థాల సరఫరా అంతరాయం కారణంగా ధరలు గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా పీసీబీ తయారీలో ఉపయోగించే ముఖ్యమైన పాలీఫెనిలీన్ ఈథర్ (పీపీఈ) రెసిన్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింది. గల్ఫ్ ప్రాంతంలోని ప్రధాన పెట్రోకెమికల్ కేంద్రంపై దాడుల తర్వాత సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ముడిసరుకు కొరత ఏర్పడింది. దీంతో ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఇప్పటికే ఉన్న మెమరీ చిప్ ధరల పెరుగుదలతో పాటు మరో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కృత్రిమ మేధ (ఏఐ) సర్వర్లకు పెరుగుతున్న డిమాండ్ కూడా పీసీబీ ధరలను మరింత ప్రభావితం చేస్తోంది. మార్చి నుంచి పెరుగుతున్న ధరలు ఏప్రిల్‌లో కొన్ని మార్కెట్లలో 40 శాతం వరకు పుంజుకున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో క్లౌడ్, టెక్ కంపెనీలు అధిక ఖర్చు చేయక తప్పట్లేదు. ఈ ఏడాది గ్లాస్ ఫైబర్, కాపర్ ఫాయిల్ వంటి ఇతర ముడి పదార్థాల కొరత కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. రాగి ధరలు ఈ ఏడాది ఇప్పటికే గణనీయంగా పెరగడంతో తయారీ ఖర్చులు భారంగా మారాయి, ఇవి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ధరలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story