Goldman Sachs: భారత వృద్ధి అంచనాలను పెంచిన గోల్డ్‌మన్ శాక్స్

by S Gopi |

అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల చమురు సరఫరాపై భయాలు తగ్గాయని, దీంతో అంతర్జాతీయ చమురు ధరలు కూడా ఒత్తిడిలోనే ఉంటాయని పేర్కొంది.

Goldman Sachs: భారత వృద్ధి అంచనాలను పెంచిన గోల్డ్‌మన్ శాక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు క్రమంగా దిగివస్తుండటంతో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.1 శాతం నుంచి 6.5 శాతానికి పెంచిన సంస్థ, రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గించింది. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల చమురు సరఫరాపై భయాలు తగ్గాయని, దీంతో అంతర్జాతీయ చమురు ధరలు కూడా ఒత్తిడిలోనే ఉంటాయని పేర్కొంది. ఇదే భారత్‌కు అనుకూలంగా మారి వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ధరల పెరుగుదలపై కూడా నియంత్రణ సాధ్యమవుతుందని అంచనా వేసింది. చమురు ధరల అంచనాలను కూడా సంస్థ తగ్గించింది. రెండు, మూడో త్రైమాసికాల్లో బ్యారెల్‌కు సగటు ధర 92 డాలర్ల నుంచి 82 డాలర్లకు, 2027 ప్రారంభంలో 80 డాలర్ల నుంచి 75 డాలర్లకు తగ్గే అవకాశముందని తెలిపింది.

ద్రవ్యోల్బణంపై కూడా గోల్డ్‌మన్ శాక్స్ సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేసింది. ఎరువుల ముడిసరుకు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ప్రభుత్వ సబ్సిడీ భారం తగ్గడమే కాకుండా, తయారీ రంగంపై ఖర్చుల ఒత్తిడి కూడా తగ్గుతుందని పేర్కొంది. అయితే వడగాలులు, వాతావరణ మార్పులు గ్రామీణ వినియోగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. రెండో త్రైమాసికం తర్వాత డిమాండ్ మళ్లీ పుంజుకుంటుందని, చమురు ధరలు నియంత్రణలో ఉంటే ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపును కూడా వాయిదా వేసే అవకాశం ఉందని పేర్కొంది.

Next Story