Apple: ఐఫోన్ 17 సిరీస్ విడుదల చేసిన యాపిల్

by S Gopi |   (  Updated:2025-09-10 06:21:03  IST  )

ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా కంపెనీ కొత్తగా ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చింది.

Apple: ఐఫోన్ 17 సిరీస్ విడుదల చేసిన యాపిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ మంగళవారం జరిగింది. ‘ఆ.. డ్రాపింగ్‌’ పేరుతో యాపిల్‌ పార్క్‌లో ఈవెంట్‌ నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో యాపిల్‌ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా కంపెనీ కొత్తగా ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ ఐఫోన్ ఎయిర్ పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈసారి ప్లస్‌ మోడల్‌కు బదులుగా ఎయిర్‌ను తీసుకొచ్చింది. వీటితో పాటు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో3, యాపిల్ వాచ్ ఆల్ట్రా 3, యాపిల్ వాచ్ సిరీస్ 11, యాపిల్ వాచ్ ఎస్ఈలను విడుదల చేసింది. ఏ19 చిప్‌సెట్ ద్వారా పనిచేసే కొత్త ఐఫోన్ ఐఓఎస్ 26తో, విజువల్ ఇంటెలిజెన్స్, లైవ్-ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్స్ కలిగి ఉంది. ఈసారి ఈవెంట్‌లో యాపిల్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్‌ను 5.5ఎంఎం మందంతో విడుదల చేసింది. ఈ పరికరం ఏ19 ప్రో చిప్‌సెట్, 6.6-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. ది ఎయిర్ కొత్త ఎన్1 చిప్ ద్వారా అప్‌గ్రేడ్ చేసిన వైఫై7, బ్లూటూత్6తో లభిస్తుంది. అంతేకాకుండా 48ఎంపీ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వచ్చే ఐఫోన్ ఎయిర్ రోజంతా బ్యాటరీ వాడేలా 40 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ చేయొచ్చని, ప్రత్యేకంగా ఈ ఫోన్‌లో ఈ-సిమ్ సౌకర్యం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కొత్త ఐఫోన్ 17 సిరీస్ కోసం సెప్టెంబర్ 12 నుంచి ప్రీ-బుకింగ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 19 నుంచి డెలివరీలు అందిస్తామని కంపెనీ తెలిపింది.

Next Story