- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Budget-2025: బడ్జెట్‌లో పన్ను ప్రయోజనాలు, రాయితీలు కోరుతున్న బీమా సంస్థలు
బీమా, ఆరోగ్య సంరక్షణ రంగాలకు రాయితీలతో సహా పలు పన్ను ప్రయోజనాలను బీమా సంస్థలు ఆశిస్తున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కొవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి సంబంధించి వైద్య ఖర్చులనగానే భయపడుతున్నారు. భారీగా పెరిగిన ఈ తరహా ఖర్చుల నుంచి ఉపశమనం లభించాలంటే ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్-2025-26 నుంచి బీమా, ఆరోగ్య సంరక్షణ రంగాలకు రాయితీలతో సహా పలు పన్ను ప్రయోజనాలను బీమా సంస్థలు ఆశిస్తున్నాయి. ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ.. మనదేశం అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించే దిశగా ముందుకు సాగుతోంది. రాబోయే బడ్జెట్ ఆరోగ్య బీమా రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి 'అందరికీ బీమా' లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించిన బీమా సుగం వంటి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా విస్తరించేందుకు నియంత్రణ, ఆర్థిక సహాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, రాయితీలు, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో పురోగతి ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ బీమా యాక్సెస్‌ను విస్తరించే విధంగా బడ్జెట్‌లో దృష్టి సారించాలని ఝా సూచించారు.
బీమా రంగం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ప్రస్తుత దేశ ఆర్థిక వృద్ధి అపారమైన అవకాశాలను అందిస్తుందని బజాజ్ అలయన్జ్ లైఫ్ ఎండి, సీఈఓ తరుణ్ చుగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)తో జీవిత బీమా ఉత్పత్తులపై పన్ను మినహాయింపు, బీమా చెల్లింపుల్లో పన్ను సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపును ప్రవేశపెట్టడం, కొత్త పన్ను విధానంలో జీవిత బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపును పొడిగించాలన్నారు. ప్రధానంగా బీమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించగలిగే స్థాయిలో బడ్జెట్ చర్యలు తీసుకోవాలని బీమా నిపుణులు భావిస్తున్నారు. దేశంలో అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలంటే ప్రోత్సాహక సంస్కరణలు అమలు చేయాలంటున్నారు.
సెక్షన్ 80డి పరిమితి పెంపుపై ఆశలు..
అందులో ప్రధానంగా.. పాలసీదారులకు పన్ను ప్రోత్సాహకాలను ఇవ్వడం ముఖ్యం. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ-మద్దతుగల బీమా పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. ఈ పథకాలకు సరైన నిధులు ఉండటం ద్వారా ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా బలహీన ప్రాంతాల్లో బీమా యాక్సెస్ గణనీయంగా మెరుగుపడుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అలాగే, ఎప్పటినుంచో ఉన్న సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపును పెంచే డిమాండ్‌ను పరిశీలించాలని బీమా రంగ నిపుణులు కోరుతున్నారు. ఆరోగ్య బీమా ప్రీమియం కోసం చెల్లించే మొత్తంపై ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80డి కింద మినహాయింపు అవకాశం ఉంది. ఇది 60 ఏళ్లలోపు వారికి గరిష్ఠంగా రూ. 25 వేలు, ఆపై వయసువారికి రూ. 50 వేలుగా ఉంది. వీటిని చివరిగా 60 ఏళ్లలోపు వారికి 2015, ఆపైన వారికి 2018 బడ్జెట్‌లలో సవరించారు. వైద్యఖర్చులు పెరగడం, అందరికీ బీమా లక్ష్యాలను సాధించాలనే మినహాయింపును పెంచాలనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్.






