Infosys: 240 మంది ట్రెయినీలపై ఇన్ఫోసిస్ వేటు

by S Gopi |

ట్రైనింగ్ అసెస్‌మెంట్‌లను క్లియర్ చేయడంలో వారు విఫలం కావడంతో 240 మందిని రిక్రూట్ చేయకుండా తొలగించినట్టు సమాచారం

Infosys: 240 మంది ట్రెయినీలపై ఇన్ఫోసిస్ వేటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ మరోసారి ట్రెయినీలపై వేటు వేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సరైన పనితీరు లేని కారనంగా 300 మందిని నియమించకుండా ఇంటికి సాగనంపిన కంపెనీ, తాజాగా ఇంటర్నల్ ట్రైనింగ్ అసెస్‌మెంట్‌లను క్లియర్ చేయడంలో వారు విఫలం కావడంతో 240 మందిని రిక్రూట్ చేయకుండా తొలగించినట్టు సమాచారం. దీనికి సంబంధించి శుక్రవారం ఉదయం కంపెనీ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తొలగించిన ఉద్యోగులు 2024, అక్టోబర్‌లో కంపెనీ ట్రెయినింగ్ బ్యాచ్‌లో చేరారు. వారిలో చాలామంది 2022లోనే ఆఫర్ లెటర్‌ను తీసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లుగా వారు ఉద్యోగంలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. కరోనా ప్రభావం, ప్రాజెక్టులు తగ్గడం, ఆ తర్వాత వచ్చిన నియామకాల తగ్గుదల వంటి కారణాలతో వారి నియామకాలు ఆలస్యమయ్యాయి. వీరంతా సిస్టమ్ ఇంజనీర్లు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం తీసుకున్నారు. అయితే, ఇటీవల నిర్వహించిన ఇంటర్నల్ ఎగ్జామ్, మాక్ అసెస్‌మెంట్లు, ఇతర సెషన్ వంటి మూడు విభాగాలను క్లియర్ చేయడంలో ఫెయిల్ అవడంతో తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, ఆ ఉద్యోగులకు సహాయంగా ఇన్ఫోసిస్ కీలక చర్యలు తీసుకుంది. వారికి ఒక నెల జీతం, ప్రయాణ భత్యం, తాత్కాలిక వసతి వంటి సౌకర్యాలను కంపెనీ కల్పించింది. అదనంగా అవసరమైతే వారు కంపెనీ అందించే శిక్షణా కార్యక్రమాల్లో చేరవచ్చని కంపెనీ ఆఫర్ చేసింది. ఆ తర్వాత వారిని తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తారు.

Next Story