Piyush Goyal: జీఎస్టీ ప్రయోజనాలను పరిశ్రమలు వినియోగదారులకు అందించాలి: పీయూష్ గోయల్

by S Gopi |

పరిశ్రమలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా పూర్తి ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలని ఆయన కోరారు.

Piyush Goyal: జీఎస్టీ ప్రయోజనాలను పరిశ్రమలు వినియోగదారులకు అందించాలి: పీయూష్ గోయల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్ అని, స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్ద సంస్కరణ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా పూర్తి ప్రయోజనాలను ప్రజలకు బదిలీ చేయాలని ఆయన కోరారు. గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మేడ్ ఇన్ ఇండియాను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పరిశ్రమ వర్గాలను కోరారు. జీఎస్టీ తగ్గింపు ప్రతి వినియోగదారునికి ప్రయోజనం అందిస్తుందని అన్నారు. గత 11 ఏళ్లలో అనేక మార్పులు చేసినప్పటికీ, తాజా సంస్కరణ సమగ్రమైన మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఫార్మా రంగంతో పాటు రైతులు, ఎంఎస్ఎంఈల వరకు అనేక రంగాలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని వివరించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణానికి ఈ చర్యలు కీలక పాత్ర పోషిస్తాయి. జీఎస్టీ రేట్లను తగ్గించడమే కాకుండా, తాజా చర్యలు వ్యాపారాల నిర్వహణ ప్రక్రియ, విధానాన్ని సులభతరం చేసేలా ఉన్నాయనే అంశాన్ని మర్చిపోవద్దు. తక్కువ జీఎస్టీ రేట్ల ద్వారా డిమాండ్‌తో పాటు పరిశ్రమల వృద్ధికి మద్దతిస్తాయి. దేశంలో కార్యకలాపాలు మునుపటి కంటే వేగంగా జరుగుతాయి. పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పుంజుకుంటాయని పీయుష్ గోయల్ పేర్కొన్నారు.

Next Story