IIP: రెండేళ్ల గరిష్టానికి పారిశ్రామికోత్పత్తి

by S Gopi |

మైనింగ్, తయారీ వంటి రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా పారిశ్రామికోత్పత్తి పుంజుకుందని ఎన్ఎస్ఓ వెల్లడించింది.

IIP: రెండేళ్ల గరిష్టానికి పారిశ్రామికోత్పత్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి నవంబర్‌లో 6.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. మైనింగ్, తయారీ వంటి రంగాల్లో మెరుగైన పనితీరు కారణంగా పారిశ్రామికోత్పత్తి గణనీయంగా పుంజుకుందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) సోమవారం ప్రకటనలో వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5 శాతం పెరిగింది. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో తయారీ రంగం 8 శాతం పుంజుకుంది. ఇది గతేడాది నవంబర్‌లో 5.5 శాతంగా ఉంది. వర్షాకాలం ముగియడంతో పాటు ఇనుప ఖనిజం వంటి లోహ ఖనిజాల ఉత్పత్తి పెరగడం వల్ల మైనింగ్ ఉత్పత్తి ఈ నవంబర్‌లో 5.4 శాతంగా నమోదైంది. గతేడాది ఇది 1.9 శాతం పెరిగింది. అయితే, విద్యుదుత్పత్తి గత నెలలో 1.5 శాతం క్షీణించింది. గతేడాది ఇది 4.4 శాతం వృద్ధి సాధించింది. మొత్తంగా ఐఐపీ సూచీ పుంజుకోవడం అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా నెమ్మదించిన తర్వాత పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడటాన్ని సూచిస్తుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.

Next Story