IndiGo: ఇండిగోలో మరింత వాటా విక్రయిస్తున్న సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్

by S Gopi |   (  Updated:2025-05-26 15:16:17  IST  )

సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండిగో షేర్ ధర రూ. 5,420 వద్ద ఉంది.

IndiGo: ఇండిగోలో మరింత వాటా విక్రయిస్తున్న సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో సహ-వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ మరోసారి సంస్థలో వాటా విక్రయించనున్నట్టు ప్రకటించారు. కొన్నేళ్ల నుంచి ఆయనకు, సంస్థ మరో వ్యవస్థాపకుడైన రాహుల్ భాటియా విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగా రాకేష్ గంగ్వాల్ క్రమంగా సంస్థలో తన వాటాను తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా బ్లాక్ డీల్ ద్వారా సంస్థలో 3.4 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ వాటా విలువ 803 మిలియన్ డాలర్లు(రూ. 6,833 కోట్లు). రాకేష్ గంగ్వాల్ ఒక్కో షేర్‌ను రూ. 5,175 ఫ్లోర్ ధరకు విక్రయించాలని భావిస్తున్నారు. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండిగో షేర్ ధర రూ. 5,420 వద్ద ఉంది. దీంతో పోలిస్తే రాకేష్ గంగ్వాల్ 4.5 శాతం తగ్గింపుతో వాటాను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 2006లో ఇండిగో సంస్థను రాహుల్ భాటియాతో కలిసి రాకేష్ గంగ్వాల్ స్థాపించారు. ప్రస్తుతం రాకేష్ గంగ్వాల్ యూఎస్ ఇండిగో సౌత్‌వెస్ట్ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షత వహిస్తున్నారు. 2022లో కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌లోని కొన్ని నియమాలలో మార్పుపై భాటియాతో వివాదం తరువాత ఇండిగో బోర్డు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నెమ్మదిగా సంస్థకు దూరమవుతూ వచ్చారు. 2022లో రాకేష్ గంగ్వాల్ కుటుంబానికి ఇండిగో సంస్థలో 36.6 శాతం వాటా ఉండగా, ప్రస్తుతం 13.5 శాతానికి తగ్గించుకున్నారు.

ఐదేళ్లుగా ప్రమోటర్ల మధ్య విభేదాలు

ఇండిగో సంస్థ ప్రమోటర్ల మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు ముదురుతున్నాయి. 2019 ప్రథమార్థంలో రాకేష్ గంగ్వాల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి కీలక అంశాలపై లేఖ రాశారు. సంస్థలో గవర్నెన్స్ లోపాలు తీవ్రస్థాయికి చేరాయని, సంస్థ నిర్వహణ సాధారణ పాన్ షాప్ కంటే దారుణంగా ఆరోపణలు చేశారు. మరో ప్రమోటర్ రాహుల్ భాటియాతో పాటు ఆయన సంస్థల లావాదేవీలు సందేహాస్పదంగా ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ భాటియాకు అసాధారణ స్థాయిలో నియంత్రణాధికారాలు ఇచ్చే విధంగా కంపెనీ షేర్ హోల్డర్ల ఒప్పందాలు జరిగినట్టు సెబీకి పంపిన లేఖలో వివరించారు. ఒకప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్న కంపెనీ విలువలు తప్పుదారి పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే సంస్థ ఎదుర్కొనబోయే సవాళ్లు తీవ్రంగా ఉంటాయని, తక్షణ దీన్ని సరిదిద్దే చర్యలు అవసరమని సెబీకి తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్‌కు కూడా లేఖ ద్వారా తెలియజేశారు.

Next Story