Wholesale Inflation: 13 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |

ప్రధాన ఆహార, ఇంధన ఖర్చులు తగ్గడతో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చింది.

Wholesale Inflation: 13 నెలల కనిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో టోకు ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ప్రధాన ఇంధన, విద్యుత్ ధరలు తగ్గడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత సూచీ(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఏకంగా 0.85 శాతానికి చేరింది. అంతకుముందు మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 2.05 శాతంగా ఉంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రధాన ఆహార, ఇంధన ఖర్చులు తగ్గడతో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చింది. తయారీ ఆహార ఉత్పత్తులు, రసాయనాలు, యంత్రాలు, రవాణా పరికరాలలో స్వల్పంగా ధరల పెరుగుదల నమోదైంది. టోకు ధరల సూచీలో ఎక్కువ భాగం ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా ఉంది. ఇంధన, విద్యుత్ ధరల ద్రవ్యోల్బణం 2.18 శాతం క్షీణించింది. ఆహార పదార్థాలకు సంబంధించి కూరగాయలు 19 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. ఉల్లి ధరలు 26.65 శాతం నుంచి 0.20 శాతానికి పడిపోయాయి. ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరలు 5.31 శాతం తగ్గడం, ఆహారేతర వస్తువుల ధరలు 1.78 శాతం తగ్గడం ద్వారా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గణనీయంగా క్షీణించేందుకు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు రోజు విడుదలైన గణాంకాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి చేరింది. మార్చిలో 3.34 శాతంగా ఉన్న సీపీఐ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.16 శాతానికి దిగొచ్చింది.

Next Story