Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగ రేటు

by S Gopi |

సీడబ్ల్యూఎస్‌ రూపంలో సేకరించిన తాజా డేటా ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగింది.

Unemployment: దేశంలో పెరిగిన నిరుద్యోగ రేటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఇప్పటివరకు నిరుద్యోగానికి సంబంధించి త్రైమాసిక, వార్షిక గణాంకాలను వెల్లడించిన ప్రభుత్వం, గత నెల నుంచి నెలవారీ డేటాను విడుదల చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిసారిగా ప్రకటించిన నెలవారీ నిరుద్యోగ రేటు ఏప్రిల్‌లో 5.1 శాతంగా నమోదైంది. తాజాగా మే నెలకు సంబంధించి ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం నిరుద్యోగ రేటు 5.6 శాతానికి పెరిగిందని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది. దేశంలో ఉద్యోగార్హత ఉన్న వ్యక్తుల్లో, ఎంత శాతం మంది నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారో తెలపడమే ఈ నివేదిక లక్ష్యం. కరెంట్‌ వీక్లీ స్టేటస్‌ (సీడబ్ల్యూఎస్‌) రూపంలో సేకరించిన తాజా డేటా ప్రకారం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగింది. యువతలో నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 15-29 ఏళ్ల వయసున్న వారిలో నిరుద్యోగ రేటు మే నెలలో 13.7 శాతానికి పెరిగింది. అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 12.3 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లోని యువతలో నిరుద్యోగ రేటు 17.9 శాతం నుంచి 17.2 శాతానికి స్వల్పంగా తగ్గింది. పురుషుల(5.6 శాతం)తో పోలిస్తే మహిళ(5.8 శాతం)లో ఎక్కువమందికి ఉద్యోగం లేదు. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రజల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) ఏప్రిల్‌లో 55.6 శాతం నుంచి మేలో 56.9 శాతానికి చేరింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 56.9 శాతం, పట్టణాల్లో 50.4 శాతంగా కనిపించింది.

Next Story