Unemployment Rate: తగ్గిన నిరుద్యోగ రేటు

by S Gopi |

గ్రామీణ ఉపాధి గణనీయంగా పెరగడంతో పాటు మహిళల భాగస్వామ్యం పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి

Unemployment Rate: తగ్గిన నిరుద్యోగ రేటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ రేటు తగ్గింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిరుద్యోగ రేటు 5.2 శాతానికి దిగొచ్చింది. అంతకుముందు జూన్ త్రైమాసికంలో ఇది 5.4 శాతంగా నమోదైంది. వ్యవసాయ సీజన్‌లో గ్రామీణ ఉపాధి గణనీయంగా పెరగడంతో పాటు మహిళల భాగస్వామ్యం పెరగడమే ఇందుకు కారణమని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో నిరుద్యోగం గ్రామీణ ప్రాంతంలో 4.8 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.8 శాతం నుంచి 6.9 శాతానికి చేరింది. 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న ప్రజల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్‌) 55. శాతం నుంచి 55.1 శాతానికి స్వల్పంగా పెరిగింది. మహిళా భాగస్వామ్య రేటు 33.4 శాతం నుంచి 33.7 శాతానికి చేరుకుంది. అయితే, పట్టణ ప్రాంతాల్లో మహిళల నిరుద్యోగిత రేటు గత త్రైమాసికంలో 8.9 శాతం ఉండగా, సెప్టెంబర్ త్రైమాసికంలో 9 శాతానికి పెరిగింది. పురుషుల్లో ఇది 6.1 శాతం నుంచి 6.2 శాతానికి పెరిగిందని గణాంకాలు పేర్కొన్నాయి.

Next Story