Semiconductor: 2030 నాటికి రూ. 3.47 లక్షల కోట్లకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ల తయారీ నుంచి భారత్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

Semiconductor: 2030 నాటికి రూ. 3.47 లక్షల కోట్లకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ సెమీకండక్టర్ పరిశ్రమ 2030 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ. 3.47 లక్షల కోట్ల)కు చేరుకుంటుందని ఎలక్ట్రానిక్స్, సమీకండక్టర్ అసోసియేషన్ ఐఈఎస్ఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీలో కీలకమైన కెమికల్స్, గ్యాస్ సహా సరఫరా వరకు అన్ని రకాల విభాగాల్లో పెట్టుబడులు, రాబడి పెరగనున్నట్టు నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందని శుక్రవారం జరిగిన ఐఈఎస్ఏ విజన్ సమ్మిట్‌లో ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ అశోక్ చందక్ వెల్లడించారు. సెమీకండక్టర్ల తయారీ క్లిష్టమైన టెక్నాలజీతో కూడుకున్నది, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ల తయారీ నుంచి భారత్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దగ్గర తయారయ్యే చిప్ ఏదైనా 10 కంటే ఎక్కువ దేశాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలో భారత సెమీకండక్టర్ తయారీ విజయవంతం కావాలంటే వాటి తయారీలో కీలకమైన కెమికల్స్, గ్యాస్ వంటి వాటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించాలని అశోక్ చందక్ వివరించారు.

అన్ని రకాల అడ్డంకులను, సమస్యలను అధిగమిస్తే ప్రపంచ సెమీకండక్టర్ తయారీలో భారత్ కనీసం 10 శాతం వాటాను అందుకోగలదు. 2030 నాటికి ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 420 బిలియన్ డాలర్లకు చేరుకోగలదనే అంచనాలు ఉన్నాయి. ఇందులో పది శాతం అంటే కనీసం 40 బిలియన్ డాలర్లను భారత్ సాధించగలదు. ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ తయారీ సంస్థలు భారత మార్కెట్‌కు తరలిరావడం, మన దేశం నుంచి ఎగుమతులు చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అశోన్ చందక్ తెలిపారు.

ఐఈఎస్ఏ నివేదిక ప్రకారం, 2026-27 నాటికి సెమీకండక్టర్ విభాగంలో సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పించనుండగా, మరో 50 లక్షల మందికి పరోక్ష ఉపాధి అందించనుంది. ప్రధానంగా ప్రాసెసింగ్, ఎక్విప్‌మెంట్ ఇంజనీర్, టెస్టింగ్ ఇంజనీర్లు, కెపాసిటీ ప్లానింగ్ మేనేజర్ వంటి ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో డిజైన్, తయారీ, ట్రైనింగ్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ వంటి పోస్టులకు అధిక డిమాండ్ ఉంటుందని నివేదిక తెలిపింది.

సహజంగానే ఈ పరిశ్రమలో పురుషుల ఆధిపత్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వంతో పాటు కంపెనీల సరైన నిర్ణయాలతో 2030 నాటికి మహిళల భాగస్వామ్యం 35 శాతానికి చేరుకోవచ్చని గ్లోబల్ డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్‌బీ సర్వీసెస్ అభిప్రాయపడింది. ప్రస్తుతం మొత్తం 2.20 లక్షల వరకు ఉన్న చిప్ డిజైన్, ఇంజనీరింగ్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు కేవలం నాలుగో వంతు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్య 2027 నాటికి 30 శాతాన్ని దాటేస్తుందని ఎన్ఎల్‌బీ సర్వీసెస్ పేర్కొంది.

Next Story