Crude Oil: మూడేళ్ల కనిష్టానికి రష్యా ముడి చమురు దిగుమతులు

by S Gopi |

రష్యా ముడి చమురు దిగుమతులు డిసెంబర్‌లో రోజుకు దాదాపు 1.2 మిలియన్(12 లక్షల) బ్యారెళ్లకు (బీపీడీ) తగ్గుతాయని అంచనా.

Crude Oil: మూడేళ్ల కనిష్టానికి రష్యా ముడి చమురు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రష్యాకు చెందిన సంస్థలపై అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఆ దేశం నుంచి చమురు దిగుమతులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ కంపెనీ కెప్లర్ ప్రకారం, భారత్‌లోకి రష్యా ముడి చమురు దిగుమతులు డిసెంబర్‌లో రోజుకు దాదాపు 1.2 మిలియన్(12 లక్షల) బ్యారెళ్లకు (బీపీడీ) తగ్గుతాయని అంచనా. ఇది నవంబర్‌లో 1.84 మిలియన్(18.4 లక్షల) బీపీడీ కంటే గణనీయమైన క్షీణత. అంతేకాకుండా ఇది 2022, డిసెంబర్ తర్వాత అత్యల్పమని డేటా పేర్కొంది. క్షీణత ఉన్నప్పటికీ, డిసెంబర్‌లో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. ఇందుకు ప్రధానంగా రష్యా చమురు కంపెనీలు రోస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించడంతో పాటు, చమురు వ్యాపారం, షిప్పింగ్‌కు ఈయూ ఆంక్షల అంతరాయం కారణాలుగా ఉన్నాయి. ఈ ఆంక్షల వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌పీసీఎల్, హిందుస్తాన్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ, మంగళూరు రిఫైనరీ వంటి భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా ముడి చమురు కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేసాయి. అయితే, ఈ సంస్థలు అనుమతి లేని రష్యా సంస్థల నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్నాయి. ఈ తగ్గుదల తాత్కాలికమేనని, మళ్లీ రష్యా చమురు దిగుమతులు పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Next Story