Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

సీపీఐ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.48 శాతంతో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చిలో ఇది 3.40 శాతంగా నమోదైంది.

Retail Inflation: నాలుగు నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తోడు కూరగాయల ధరలు పుంజుకోవడంతో ఏప్రిల్ నెలకు సంబంధించి వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.48 శాతంతో నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. మార్చిలో ఇది 3.40 శాతంగా నమోదైంది. ఆహార ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.74 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో అది 3.16 శాతంగా నమోదైంది. ముఖ్యంగా టమాటా, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయల ధరలు భారీగా పెరగడం ఆహార ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచాయి. టమాటా ధరలు ఏడాదిలో 35 శాతం పైగా పెరగగా, క్యాలీఫ్లవర్ ధరలు 25 శాతం దాటాయి. బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల ధరలు మాత్రం గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ఆభరణాల ద్రవ్యోల్బణం 144 శాతం ఖరీదయ్యాయి.

తెలంగాణలోనే అత్యధికం

రాష్ట్రాల వారీగా చూస్తే.. తెలంగాణ 5.81 శాతంతో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి కూడా అధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం 2-6 శాతం పరిధిలోనే ఉన్నప్పటికీ, ఆహార ధరల ఒత్తిడి, గ్లోబల్ చమురు ధరల పెరుగుదల కారణంగా రాబోయే నెలల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.

Next Story