Retail Inflation: ఏడు నెలల కనిష్ఠానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |   (  Updated:2025-03-12 18:30:17  IST  )

రిటైల్ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం కంటే దిగువకు పడిపోవడం ఆరు నెలల్లో ఇదే మొదటిసారి.

Retail Inflation: ఏడు నెలల కనిష్ఠానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టానికి దిగొచ్చింది. ప్రధాన ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత(సీపీఐ) ద్రవ్యోల్బణం 3.61 శాతంగా నమోదైంది. అంతకుముందు జనవరిలో ఇది 4.31 శాతంగా ఉంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం కంటే దిగువకు పడిపోవడం ఆరు నెలల్లో ఇదే మొదటిసారి. సమీక్షించిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలకమైన ఆహార ద్రవ్యోల్బణం జనవరిలో 5.97 శాతం నుంచి 3.75 శాతానికి గణనీయంగా తగ్గింది. ఇది 2023, మే తర్వాత కనిష్టమని గణాంకాలు పేర్కొన్నాయి. గత నెలలో కూరగాయల ధరల ద్రవ్యోల్బణం జనవరిలో 11.35 శాతంతో పోలిస్తే 1.07 శాతానికి తగ్గింది. తృణధాన్యాల ధరలు 6.10 శాతం పెరగ్గా, పప్పుధాన్యాల ధరలు 0.35 శాతం తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.59 శాతం నుంచి 3.79 శాతానికి, పట్టణాల్లో 3.87 శాతం నుంచి 3.32 శాతానికి చేరుకుంది. మరోవైపు, జనవరి నెలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) 5 శాతం పెరిగింది. అంతకుముందు 2024, డిసెంబర్ ఇది 3.5 శాతం మాత్రమే వృద్ధి నమోదు చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన డేటా ప్రకారం, ఐఐపీ సూచీలో తయారీ రంగ ఉత్పత్తి 5.5 శాతం, మైనింగ్ ఉత్పత్తి 4.4 శాతం, విద్యుదుత్పత్తి 2.4 శాతం మాత్రమే పెరిగింది.


Also Read..

Petrol & Diesel Price Today ( March - 12) : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story