- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: అంచనాలకు మించి వృద్ధి రేటు
ఇందుకు ప్రధానంగా తయారీతో పాటు సేవల రంగ కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడం దోహదపడ్డాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత జీడీపీ వృద్ధి రేటు ఊహించని స్థాయిలో అంచనాలకు మించి నమోదైంది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థికవ్యవస్థ 8.2 శాతం వృద్ధిని సాధించింది. ఈ మేరకు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీసు(ఎన్ఎస్ఓ) డేటా విడుదల చేసింది. ఇది ఆరు త్రైమాసికాల గరిష్టం కావడం విశేషం. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి 5.6 శాతంగా నమోదైంది. అంతేకాకుండా తొలి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం కంటే కూడా ఎక్కువే నమోదైంది. ఇందుకు ప్రధానంగా తయారీతో పాటు సేవల రంగ కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడం దోహదపడ్డాయి. ప్రైవేట్ పెట్టుబడులు నామమాత్రంగానే ఉన్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ వ్యయం పెరగడం జీడీపీ వృద్ధిలో కీలకంగా వ్యవహరించాయి. ప్రధానంగా పండుగ సీజన్‌కు ముందు కేంద్రం అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దోహదపడ్డాయి. ఇది వినియోగం పెరిగేందుకు, వృద్ధికి కలిసొచ్చింది. అయితే, జీఎస్టీ ప్రయోజనాల ఫలితాలు వృద్ధి రేటులో పూర్తిగా ప్రతిబింబించలేదు. సెప్టెంబర్ రెండో వారంలో రేట్ల తగ్గింపు ప్రకటన రావడంతో మూడో త్రైమాసికంలో వీటి ఫలితాలు కనిపిస్తాయి.
క్యూ2లో 8.2 శాతం వృద్ధి నమోదవడం దేశ ఆర్థికవ్యవస్థ సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసింది. ముఖ్యంగా ప్రపంచ అనిశ్చితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్ ప్రభావం ఉన్నా సరే ఈ స్థాయి వృద్ధి నమోదవడం దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టతను ప్రతిబింబిస్తుంది. ఇదే రెండో త్రైమాసికంలో తయారీ రంగం 9.1 శాతం, ఫైనాన్షియల్, ప్రొఫెషనల్ సర్వీస్ రంగంలో 10.2 శాతం వృద్ధి మొత్తం దేశ వృద్ధికి ఇంజన్‌లుగా పనిచేశాయి. ప్రైవేట్ వినియోగం కూడా 7.9 శాతం పుంజుకుంది. ఇది ఆర్థికవ్యవస్థలో ఆరోగ్యకరమైన గిరాకీ పరిస్థితులను సూచిస్తుంది. మొత్తంగా దేశీయ పరిణామాలు, పెట్టుబడులతో వృద్ధి స్థిరంగా ఉందనే నమ్మకాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు తెలిపారు.






