RIL: తగ్గనున్న రష్యా చమురు దిగుమతులు

by S Gopi |

ఇటీవల రిలయన్స్ సంస్థ రష్యా చమురును దిగుమతి చేసుకుంటోందని గ్లోబల్ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపింది.

RIL: తగ్గనున్న రష్యా చమురు దిగుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరిలో రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతులు క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా చమురు డెలివరీలు ఉంటాయని అనుకోవట్లేదని ప్రకటన విడుదల చేయడమే ఇందుకు నేపథ్యం. దీంతో ఈ నెలలో చమురు దిగుమతులు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇటీవల రిలయన్స్ సంస్థ రష్యా చమురును దిగుమతి చేసుకుంటోందని గ్లోబల్ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ కథనం తెలిపింది. సుమారు 22 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు ఉన్న మూడు నౌకలు రిలయన్స్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ వైపు వెళ్లాయని, జనవరిలో డెలివరీ అవుతాయని పేర్కొంది. దీనిపై స్పందించిన సంస్థ, అటువంటిదేమీ లేదని, తమపై తప్పుడు కథనాలు వెలువడుతున్నాయని, అసత్యాలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన మూడు వారాల్లో జామ్‌నగర్ రిఫైనరీకి ఎలాంటి రష్యా నౌకలు రాలేదని, జనవరి నెలకు సంబంధించిన డెలివరీలను కూడా తిరస్కరించామని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు వ్యవహారంలో భారత్‌పై అమెరికా అధిక సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. సుంకాలను మరింత పెంచవచ్చని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో బ్లూమ్‌బర్గ్ కథనం వెలువడం రిలయన్స్ సంస్థ అధికారిక ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది.

Next Story