GST: ఆగష్టు జీఎస్టీ వసూళ్లు రూ. 1.86 లక్షల కోట్లు

by S Gopi |

జీఎస్టీ వాపసులు 20 శాతం తగ్గి రూ. 19,359 కోట్లకు చేరుకున్నాయి.

GST: ఆగష్టు జీఎస్టీ వసూళ్లు రూ. 1.86 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఆగష్టులో రూ.1.86 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 6.5 శాతం వృద్ధి నమోదైంది. ఈ మేరకు జీఎస్టీ ఆదాయానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం సోమవారం విడుదల చేసింది. అంతకుముందు జూలైలోనూ రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. జీఎస్టీ వసూళ్లు గత కొన్ని నెలలుగా రూ.1.8 లక్షల కోట్లు పైన స్థిరంగా నమోదవుతున్నాయి. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇది వరుసగా ఎనిమిదోసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రూ.2.37 లక్షల కోట్లు వసూళ్లే అత్యధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగష్టులో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 1,86,315 కోట్లుగా ఉంది. మొత్తం వసూళ్లలో దేశీయంగా వచ్చిన ఆదాయం 9.6 శాతం పెరిగి రూ. 1.37 లక్షల కోట్లు, దిగుమతుల నుంచి వచ్చే ఆదాయం 1.2 శాతం క్షీణించి రూ. 49,354 కోట్లకు చేరాయి. జీఎస్టీ వాపసులు 20 శాతం తగ్గి రూ. 19,359 కోట్లకు చేరుకున్నాయి. సీజీఎస్టీ రూ.34,076 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ రూ.42,854 కోట్లు, ఐజీఎస్టీ రూ.97,186 కోట్లు, సెస్సు రూ.12,199 కోట్లు వచ్చాయి.

జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రెండు రోజుల ముందు ఈ డేటా విడుదలైంది. ఈ సమావేశంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల సంఖ్య తగ్గింపుపై చర్చించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3-4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక మంత్రులు 5, 18 శాతం రెండు-శ్లాబ్ పన్నుల గురించి చర్చిస్తారు.

Next Story