millionaires: నాలుగేళ్లలో రెట్టింపు పెరిగిన మిలియనీర్ల సంఖ్య

by S Gopi |

సమీక్షించిన కాలంలో మిలియనీర్ల సంఖ్య 90 శాతం పెరగడంతో వారి సంఖ్య దాదాపు 8,71,700కి చేరింది.

millionaires: నాలుగేళ్లలో రెట్టింపు పెరిగిన మిలియనీర్ల సంఖ్య
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో సంపన్నుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. రూ. 8.5 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 2021 నుంచి 2025 మధ్య కాలంలో దాదాపు రెట్టింపు పెరిగిందని మెర్సిడెస్-బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది. నివేదిక ప్రకారం, సమీక్షించిన కాలంలో మిలియనీర్ల సంఖ్య 90 శాతం పెరగడంతో వారి సంఖ్య దాదాపు 8,71,700కి చేరింది. 2021లో వీరి సంఖ్య 4,58,000గా ఉంది. ఈ వృద్ధి దేశ ఆర్థికవ్యవస్థ సాధిస్తున్న స్థిరమైన వృద్ధికి, పుంజుకుంటున్న సంపద సృష్టికి, దాని సామర్థ్యానికి నిదర్శనమని నివేదిక అభిప్రాయపడింది. అత్యధికంగా ముంబై 1.42 లక్షల మిలియనీర్ కుటుంబాలతో ముందంజలో ఉంది. ఆ తరువాత ఢిల్లీ 79,800, బెంగళూరు 31,600 మందిని కలిగి ఉంది.

ముంబై ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల కారణంగా మహారాష్ట్ర 1.78 లక్షల మిలియనీర్ కుటుంబాలతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా రాష్ట్ర జీఎస్‌డీపీ 55 శాతం పెరిగి రూ. 40.5 లక్షల కోట్లకు ( 480 బిలియన్ డాలర్లకు) చేరుకుంది. మనదేశ సంపద వృద్ధికి దోహదపడే ఇతర ప్రముఖ నగరాల్లో అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, పూణే, హైదరాబాద్ ఉన్నాయి.

టైర్-2 నగరాల పెరుగుదల

ముఖ్యంగా టైర్-2 లేదా చిన్న నగరాల్లో పెరుగుతున్న మిలియనీర్ల గురించి నివేదిక ప్రస్తావించింది. వేగంగా మిలియనీర్లు పెరుగుతున్న టాప్ 10 నగరాల్లో ఏడు టైర్-2 నగరాలు ఉన్నాయి. అవి.. అహ్మదాబాద్, సూరత్, జైపూర్, వడోదర, నాగ్‌పూర్, విశాఖపట్నం, లక్నో. దీన్ని బట్టి సంపద మునుపటి లాగా మెట్రోలకు మాత్రమే పరిమితం అవ్వట్లేదని నివేదిక తెలిపింది.

సంపన్నుల్లో ఎక్కువమంది స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్, బంగారం వంటి ప్రధాన పెట్టుబడి మార్గాలను తమ సంపద సృష్టికి కేంద్రంగా ఎంచుకుంటున్నారు. కొత్తగా మిలియనీర్లుగా మారిన వారిలో 51 శాతం మంది రియల్ ఎస్టేట్ రంగం వచ్చే రెండేళ్లలో ఎక్కువ వృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నారు.

Next Story