Gig Economy: 2030 నాటికి 2 కోట్లకు చేరనున్న గిగ్ వర్కర్లు

by S Gopi |

2025-2030 మధ్య ఈ రంగం ఏటా 24-29 శాతం వృద్ధి చెందుతుందని, దశాబ్దం చివరినాటికి దేశ కార్మిక శక్తిలో గిగ్ వర్కర్ల వాటా సుమారు 3 శాతానికి పెరుగుతుందని అంచనా.

Gig Economy: 2030 నాటికి 2 కోట్లకు చేరనున్న గిగ్ వర్కర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో గిగ్ ఎకానమీ వేగంగా విస్తరిస్తూ ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం డెలివరీ, రైడ్-హెయిలింగ్, హోమ్ సర్వీస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రతి నెల పనిచేస్తున్న గిగ్ కార్మికుల సంఖ్య 60 లక్షలకు పైగా ఉండగా, 2030 నాటికి అది 1.7 కోట్ల నుంచి 2.1 కోట్ల మధ్యకు చేరే అవకాశం ఉంది. 2025-2030 మధ్య ఈ రంగం ఏటా 24-29 శాతం వృద్ధి చెందుతుందని, దశాబ్దం చివరినాటికి దేశ కార్మిక శక్తిలో గిగ్ వర్కర్ల వాటా సుమారు 3 శాతానికి పెరుగుతుందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 80 లక్షల కొత్త వ్యవసాయేతర ఉద్యోగాలు అవసరమవుతుండగా, గిగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏటా 51 లక్షల నుంచి 63 లక్షల వరకు ఆదాయ అవకాశాలు కల్పించగలవని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గిగ్ వర్కర్లలో 30 శాతానికి పైగా తొలిసారి ఉద్యోగ రంగంలోకి అడుగుపెడుతున్న వారే కావడం, యువతకు ఇది పెద్ద ఉపాధి వేదికగా మారుతోందని నివేదిక అభిప్రాయపడింది.

నెలకు రూ. 32 వేల సగటు ఆదాయం

గిగ్ వర్క్ చాలా మందికి శాశ్వత ఉద్యోగం కాకుండా అదనపు లేదా తాత్కాలిక ఆదాయ వనరుగా మారిందని నివేదిక తెలిపింది. ప్లాట్‌ఫామ్‌లలో చేరకముందు 54 శాతం మంది వేతన ఉద్యోగంలో లేరని, వారిలో 37 శాతం మంది తొలిసారి ఉద్యోగం ప్రారంభించినవారేనని నివేదిక వెల్లడించింది. పూర్తి సమయం పనిచేసే గిగ్ వర్కర్ సగటున నెలకు రూ.32 వేల ఆదాయం పొందుతున్నాడు. హోమ్ సర్వీసెస్ విభాగంలో ఈ ఆదాయం రూ.70-80 వేల వరకు ఉండగా, రైడ్-హెయిలింగ్ కార్మికులు రూ.37-39 వేలు, డెలివరీ పార్ట్‌నర్స్ రూ.22-23 వేలు సంపాదిస్తున్నారు.

Next Story