India GDP: భారత వృద్ధి అంచనాల్లో కోత

by S Gopi |

ప్రపంచ వృద్ధి ప్రబావం కూడా భారత్‌పై ఉందని నివేదిక పేర్కొంది.

India GDP: భారత వృద్ధి అంచనాల్లో కోత
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను తగ్గిస్తున్నట్లు పలు రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి, మూడీస్ లాంటి సంస్థలు అమెరికా సుంకాలతో పాటు వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన అనిశ్చితుల కారణంగా దేశ జీడీపీలో కోత విధించాయి. తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో పాటు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) కూడా భారత వృద్ధి విషయంలో తగ్గుదలను ప్రకటించాయి. అమెరికా సుంకాల ప్రభావం, ఆ దేశంతో ఉన్న విధానపరమైన చర్యల చుట్టూ నెలకొన్న అనిశ్చిత కారణంగా 2025-26లో భారత జీడీపీ వృద్ధి వేగం 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గవచ్చని ఏడీబీ మంగళవారం వెల్లడించింది. ప్రపంచ వృద్ధి ప్రబావం కూడా భారత్‌పై ఉందని, అమెరికా విధానాలతో పెట్టుబడుల రాకలో ఇబ్బందులు తలెత్తవచ్చని ఏడీబీ తన ఔట్‌లుక్ జూలై-2025 నివేదికలో పేర్కొంది. ఈ సవాళ్లను అధిగమించేలా భారత్‌లో ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి, గ్రామీణ ప్రాంత డిమాండ్ ద్వారా వినియోగం ద్వారా ఇతర దేశాల కంటే మెరుగైన వృద్ధి భారత్ సాధించగలదని నివేదిక అభిప్రాయపడింది.

వృద్ధి ఎలా సాధ్యం

సాధారణం కంటే ఎక్కువ వానలతో వ్యవసాయ రంగానికి మద్దతు లభించనుంది. సేవలు, వ్యవసాయం భారత వృద్ధికి కీలకమైన చోదకాలు, కాబట్టి వృద్ధి మెరుగ్గా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ డివిడెండ్ రావడంతో ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది, ఆర్థిక లోటు తగ్గించుకునేందుకు వీలవుతుందని ఏడీబీ తెలిపింది.

ఇండ్-రా అంచనాలు

మరో రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్-రా) కూడా భారత వృద్ధిని 6.6 నుంచి 6.3 శాతానికి స్వల్పంగా తగ్గించింది. అమెరికా సుంకాలు, అంచనాల కంటే తక్కువ పెట్టుబడుల వల్ల భారత్ కొంత వృద్ధిని కోల్పోయే అవకాశం ఉంది. అమెరికా ఏకపక్షంగా ప్రకటిస్తున్న సుంకాల వల్ల ప్రపంచ డిమాండ్, వాణిజ్యం రెండింటీ వల్ల వృద్ధి నెమ్మదించేందుకు కారణమవుతున్నాయని ఇండ్-రా పేర్కొంది.

Next Story