GDP Growth: రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం: ఇండ్-రా

by S Gopi |

బలమైన ప్రైవేట్ వినియోగం, సేవల రంగంలో స్థిరమైన వృద్ధిని ఇందుకు దోహదపడ్డాయని ఇండ్-రా నివేదిక అభిప్రాయపడింది.

GDP Growth: రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం: ఇండ్-రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి(జూలై-సెప్టెంబర్) సంబంధించి దేశ జీడీపీ 7.2 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) తెలిపింది. బలమైన ప్రైవేట్ వినియోగం, సేవల రంగంలో స్థిరమైన వృద్ధిని ఇందుకు దోహదపడ్డాయని బుధవారం ప్రకటనలో ఇండ్-రా నివేదిక అభిప్రాయపడింది. గతేడాది ఇదే సమయంలో దేశ జీడీపీ 5.6 శాతంగా, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనాలను దాటి వృద్ధి 7.8 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇది గత ఐదు త్రైమాసికాల్లోనే అత్యంత వేగవంతమైన వృద్ధి. ఉన్నత, దిగువ-ఆదాయ వర్గాల ఆదాయం పెరగడంతో ప్రైవేటు వినియోగం జీడీపీ వృద్ధికి చోదక శక్తిగా మారిందని ఇండ్-రా తెలిపింది. పటిష్టమైన దేశీయ డిమాండ్ కారణంగా ఆర్థికవ్యవస్థ అంచనాల కంటే మెరుగ్గా వృద్ధిని సాధించింది. ప్రపంచ సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలను భారత ఆర్థికవ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొందని నివేదిక స్పష్టం చేసింది. ఇదే సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఊహించిన దానికంటే రిటైల్ ద్రవ్యోల్బణం వేగంగా తగ్గిందని, ఇది ఆదాయం, వినియోగాన్ని పెంచడానికి సహాయపడిందని నివేదిక పేర్కొంది.

Next Story