Fertiliser: ఎరువుల రంగంపై యుద్ధ ప్రభావం

by S Gopi |

ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ వ్యయం రూ. 3 లక్షల కోట్లను దాటవచ్చని ఎరువుల శాఖ జాయింట్ సెక్రటరీ కృష్ణ కాంత్ పాఠక్ తెలిపారు

Fertiliser: ఎరువుల రంగంపై యుద్ధ ప్రభావం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత ఎరువుల రంగంపై తీవ్ర ఆర్థిక ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం కారణంగా ముడి పదార్థాల ధరలు, దిగుమతి వ్యయాలు పెరుగుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఎరువుల సబ్సిడీ వ్యయం రూ. 3 లక్షల కోట్లను దాటవచ్చని ఎరువుల శాఖ జాయింట్ సెక్రటరీ కృష్ణ కాంత్ పాఠక్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల టన్నులకు పైగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని సమకూర్చేందుకు ప్రభుత్వం భారీ ఖర్చు భరించాల్సి వస్తోందన్నారు. ఈ అంచనా నిజమైతే, ఎరువుల సబ్సిడీ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరడమే కాకుండా, తాజా బడ్జెట్ అంచనాలను కూడా గణనీయంగా మించిపోతుంది.

దేశవ్యాప్తంగా సుమారు 70 మిలియన్ టన్నుల ఎరువులను వినియోగిస్తుండగా, అందులో యూరియా వాటా అత్యధికంగా ఉంది. అయితే యూరియాలో కేవలం 30 శాతం మాత్రమే పంటలకు ఉపయోగపడుతుండటం ఆందోళన కలిగించే అంశమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జింక్ లేదా సల్ఫర్ పూత పూసిన యూరియా, అమ్మోనియం సల్ఫేట్ వంటి ప్రత్యామ్నాయాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, రాక్ ఫాస్ఫేట్, పొటాష్ వంటి కీలక ముడి పదార్థాల దేశీయ ఉత్పత్తిని పెంచడం, పంటల పోషక వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ ఎరువుల భద్రతను బలోపేతం చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలుగా మారింది.

Next Story