Economy: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.4 శాతం

by S Gopi |

అధిక వృద్ధి కొనసాగేందుకు ప్రధానంగా సేవల రంగం ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు భావిస్తున్నాయి.

Economy: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి 7.4 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు 7.4 శాతం వృద్ధి సాధించవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) బుధవారం ఈ ఏడాది తొలి ముందస్తు అంచనా గణాంకాలను విడుదల చేసింది. ఈ అంచనా ప్రభుత్వం గతంలో అంచనా వేసిన 6.3–6.8 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకారం, వాస్తవ జీడీపీ వృద్ధి 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంది, అయితే నామమాత్రపు జీడీపీ వృద్ధి 8.0 శాతంగా అంచనా వేసింది.

సేవల రంగమే కీలకం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక వృద్ధి కొనసాగేందుకు ప్రధానంగా సేవల రంగం ప్రధాన చోదక శక్తిగా ఉంటుందని ప్రభుత్వ గణాంకాలు భావిస్తున్నాయి. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలతో పాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర ప్రభుత్వ సేవలు స్థిర ధరల వద్ద 9.9 శాతం వృద్ధి చెందుతాయని అంచనా. వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సంబంధిత సేవలలో వృద్ధి 7.5 శాతంగా అంచనా వేశారు. పారిశ్రామిక రంగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ, నిర్మాణం కలిసి 7.0 శాతం వృద్ధి చెందుతాయి. ఇది పారిశ్రామిక కార్యకలాపాలలో కొనసాగుతున్న వేగాన్ని సూచిస్తుందని ఎన్ఎస్ఓ వివరించింది.

నెమ్మదిగా వ్యవసాయ వృద్ధి

ఇతర రంగాలతో పోల్చినప్పుడు, వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలలో వృద్ధి 3.1 శాతం వద్ద మితంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి వినియోగ సంబంధిత రంగాలు కూడా తక్కువగా వృద్ధిని చూసే అవకాశం ఉంది. ఇక, డిమాండ్‌కు సంబంధించి.. సామాన్యులు చేసే ఖర్చు ఎక్కువగా ఉండటంతో, ప్రైవేట్ వినియోగం ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. దేశీయంగా పెట్టుబడులు కూడా మెరుగుపడతాయని, మౌలిక సదుపాయాలపై వ్యయం గతేడాది ఉన్న 7.1 శాతం కంటే ఎక్కువగా 7.8 శాతానికి పెరుగుతుందని ఎన్ఎస్ఓ పేర్కొంది.

Next Story