Nirmala Sitaraman: దేశీయ డిమాండ్‌తోనే ట్రంప్ సుంకం ప్రభావాన్ని ఎదుర్కొంటాం: ఆర్థిక మంత్రి

by S Gopi |

దేశీయ సామర్థ్యాలను, అంతర్జాతీయంగా ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ పరిణామాలను భారత్ సద్వినియోగం చేసుకుంటుందన్నారు.

Nirmala Sitaraman: దేశీయ డిమాండ్‌తోనే ట్రంప్ సుంకం ప్రభావాన్ని ఎదుర్కొంటాం: ఆర్థిక మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యం ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని, దేశ ఆర్థికవ్యవస్థ స్థిరత్వం, దేశీయ డిమాండ్ ద్వారా వృద్ధి ఇంజిన్‌గానే కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యూకే పర్యటనలో ఉన్న ఆమె, మంగళవారం లండన్‌లోని హైకమిషన్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. దేశీయ సామర్థ్యాలను, అంతర్జాతీయంగా ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ పరిణామాలను భారత్ సద్వినియోగం చేసుకుంటుందన్నారు. భారత్ ఐదేళ్ల నుంచి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా ఉంది. తాత్కాలికంగా వృద్ధి నెమ్మదించినప్పటికీ, దేశీయ వినియోగం వృద్ధిని వేగవంతంగా కొనసాగిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికా భారత్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వామి. కాబట్టి, సుంకాలతో పాటు యూఎస్ ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా వాణిజ్యం ప్రభావితం కావొచ్చు. అయినప్పటికీ దేశీయ డిమాండ్ ప్రపంచ సరఫరాను ఆకర్షించగల అతిపెద్ద అయస్కాంతంగా ఉంటుందని, ఫలితంగా ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రి వివరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాలు, ఆర్థిక మార్కెట్ అస్థిరత కారణంగా తలెత్తే ప్రపంచ సవాళ్లను భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఎదుర్కోవడం లేదని ఆమె చెప్పారు. ఈ ఎదురుగాలులను దేశీయ సామర్థ్యం బలోపేతం చేయడం ద్వారా అధిగమిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Next Story