Ads Industry: రూ. లక్ష కోట్లు దాటనున్న యాడ్స్ పరిశ్రమ

by S Gopi |

గతేడాది సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల కారణంగా యాడ్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి.

Ads Industry: రూ. లక్ష కోట్లు దాటనున్న యాడ్స్ పరిశ్రమ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రకటనల పరిశ్రమ మార్కెట్ విలువ ఈ ఏడాదిలో రూ. లక్ష కోట్లకు అధిగమిస్తుందని ఓ నివేదిక అంచనా వేసింది. గతేడాది సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల కారణంగా యాడ్ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దానివల్ల 2024లో పరిశ్రమ 6.4 శాతం పెరిగింది. ప్రముఖ డెంట్సు ఇండియా సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. డిమాండ్ కారణంగా మార్కెట్‌ గణనీయంగా పుంజుకుంది. 2025లోనూ ఈ ధోరణి కొనసాగి వార్షిక పరంగా పరిశ్రమ 6.5 శాతం వృద్ధి రేటుతో రూ. 1,07,664 కోట్లకు చేరుకోవచ్చని నివేదిక వెల్లడించింది. ట్రెండ్ 2026లో మరింత వేగవంతంగా 7.2 శాతం వృద్ధితో రూ. 1.15 లక్షల కోట్లకు చేరుకోనుంది. మొత్తం ప్రకటనల పరిశ్రమలో 49 శాతం అంటే రూ. 49,251 కోట్లతో డిజిటల్ మీడియా అత్యధిక ఆదాయాన్ని ఇస్తోంది. దీని తర్వాత టెలివిజన్ 28 శాతం (రూ. 28,062 కోట్లు), ప్రింట్ మీడియా 17 శాతం (రూ. 17,529 కోట్లు) అందించింది. ఈ ఏడాదిలో ఐపీఎల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్‌లు ఉండటం కలిసిరానుంది. ఇలాంటి హై-లెవల్ ఈవెంట్‌ల కారణంగా చాలా బ్రాండ్లు వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు యాడ్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేయనున్నాయి. ఇది మొత్తం పరిశ్రమ అంతటా ప్రభావం ఉంటుంది. దీనికి తోడు టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రియాల్టీ షోలు, స్పోర్ట్స్ కంటెంట్‌పై పెరిగిన వ్యయం, పెద్ద ఫార్మాట్ ప్రింట్ యాడ్స్ ఊపందుకోవడం, డిజిటల్ యాడ్స్‌లో ఎక్కువ పెట్టుబడులు వస్తుండటం వంటి అంశాలు పరిశ్రమ వృద్ధికి మద్దతివ్వనున్నాయి. నివేదిక ప్రకారం, డిజిటల్ యాడ్స్‌కు ఈ-కామర్స్, ఆటోమోటివ్, బీఎఫ్ఎస్ఐ(బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్), ఎఫ్ఎంసీజీ, రిటైల్ వంటి కీలక పరిశ్రమల నుంచి ఎక్కువ దోహదపడుతున్నాయని పేర్కొంది.

Next Story