CAIT: టర్కీ, అజర్‌బైజాన్‌లకు వ్యాపారం బంద్

by S Gopi |

పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన కారణంగా టర్కీ, అజర్‌బైజాన్‌లకు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని సీఏఐటీ నిర్ణయించింది.

CAIT: టర్కీ, అజర్‌బైజాన్‌లకు వ్యాపారం బంద్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ గౌరవాన్ని నిలబెట్టేందుకు భారతీయ వ్యాపారుల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు పాక్‌కు మద్దతివ్వడం పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాపారుల సంఘం నేతలు ఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌కు మద్దతిచ్చిన కారణంగా టర్కీ, అజర్‌బైజాన్‌లకు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) నిర్ణయించింది. రెండు దేశాలను పూర్తిస్థాయిలో బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ' 24 రాష్ట్రాలకు చెందిన ట్రేడ్ లీడర్లు సమిష్టిగా దీనికి ఒప్పుకున్నారు. కారణం స్పష్టం. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతిచ్చాయి. అందుకే ఈ రెండు దేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరగవని' సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఇరు దేశాలతో ఇకపై ఎలాంటి వ్యాపారం జరగదు. టర్కీ, అజర్‌బైజాన్‌లలో యాడ్స్, లేదా సినిమాలను చిత్రీకరణ కూడా జరగకూడదని దేశీయ కంపెనీలు, చిత్ర పరిశ్రమ వర్గాలను కోరాం. సాధారణంగా చాలా కంపెనీలు ఈ దేశాల్లో తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ షూట్ చేస్తాయి. వాటిని కూడా చేయవద్దని చెప్పాం. ఏదైనా కంపెనీలు ఈ నిర్ణయాన్ని కాదని చేస్తే, ఆ కంపెనీని కూడా బహిష్కరిస్తామని ప్రవీణ్ ఖండేల్వాల్ స్పష్టం చేశారు. ఈ బహిష్కరణ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆసియాలో అతిపెద్ద పండ్లు, కూరగాయ హోల్‌సేల్ మార్కెట్ అజాద్‌పూర్ మండి, టర్కీ నుంచి యాపిల్ దిగుమతులను నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. 'తాము ఏళ్లుగా టర్కిష్ వ్యాపారానికి మద్దతిచ్చాం. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని కొనసాగించలేమని అజాద్‌పూర్ ఫ్రూట్ మండి ఛైర్మన్ మీతా రామ్ క్రిప్లానీ అన్నారు.

సీఏఐటీ దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వ్యాపారులు, 40,000 కంటే ఎక్కువ వాణిజ్య సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఎంత వ్యాపారం జరుగుతోందంటే

డేటా ప్రకారం.. 2024, ఏప్రిల్ నుంచి 2025, ఫిబ్రవరి మధ్య మన దేశం నుంచి టర్కీకి జరిగిన ఎగుమతుల విలువ దాదాపు రూ. 45 వేల కోట్లుగా ఉంది. ఇదే సమయంలో టర్కీ నుంచి దిగుమతులు సుమారు రూ. 25 వేల కోట్లుగా ఉన్నాయి. అదేవిధంగా, 2024-25 మధ్య అజర్‌బైజాన్‌కు రూ. 736 కోట్ల భారత ఎగుమతులు నమోదయ్యాయి. అజర్‌బైజాన్ నుంచి రూ. 16.5 కోట్ల విలువైన దిగుమతులు జరిగాయి.

ప్రభావితమయ్యే కొన్ని వ్యాపారాలు..

ఎగుమతులు

*శుద్ధి చేసిన పెట్రోలియం: భారత్‌లో శుద్ధి చేసిన పెట్రోలియం ఎగుమతులకు టర్కీ ముఖ్యమైన మార్కెట్.

*వాహనాలు, విడిభాగాలు

*ఉక్కు, రసాయనాలు: టర్కీలోని ఉక్కు, రసాయన పరిశ్రమలు భారతీయ దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి.

*ఫార్మాస్యూటికల్స్

*విలువైన రాళ్ళు, టెక్స్‌టైల్స్

దిగుమతులు

*ముడి చమురు

*మార్బుల్, బంగారం

*పండ్లు, ప్లాస్టిక్‌

ఇతర వ్యాపారాలు

*పర్యాటకం: టర్కీ, అజర్‌బైజాన్‌ను ప్రోత్సహించే ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు ఇప్పటికే బుకింగ్‌లను ఆపేశాయి. గత వారంలో ఈ దేశాలకు ఫ్లైట్ బుకింగ్‌లు ఇప్పటికే 60 శాతం క్షీణించాయి.

*ఫిల్మ్ ప్రొడక్షన్స్

*ఆ దేశాల్లోని ఫర్నిచర్, ఫుడ్ ప్రాసెసింగ్, మైనింగ్ లాంటి పరిశ్రమలు ప్రభావితం కానున్నాయి.

Next Story