- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crude Oil: అమెరికా, అబుదాబీ చమురు కొంటున్న దేశీయ చమురు సంస్థలు
ఎంఆర్‌పీఎల్ రష్యన్ చమురును అబుదాబి క్రూడ్‌తో భర్తీ చేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు క్రమంగా తగ్గిస్తున్నాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ అమెరికా నుంచి మరింత చమురు కొనేందుకు ప్రయత్నిస్తుండగా, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్) రష్యన్ చమురును అబుదాబి క్రూడ్‌తో భర్తీ చేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. గతవారం రష్యాకు చెందిన ప్రధాన ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో చాలావరకు భారతీయ చమురు శుద్ధి సంస్థలు రష్యా చమురు ఆర్డర్లను నిలిపేశాయి. భారత చమురు శుద్ధి సంస్థ హెచ్‌పీసీల్-మిట్టల్ ఎనర్జీ కూడా రష్యా చమురు కొనుగోలును కూడా ఆపివేసినట్టు తెలిపింది. కొన్ని సంస్థలు ప్రత్యామ్నాయాల కోసం స్పాట్ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గురువారం రాయిటర్స్ సమీక్షించిన డాక్యుమెంట్ల ప్రకారం, 2026లో మొదటి త్రైమాసికానికి అమెరికా నుంచి 24 మిలియన్ బ్యారెళ్ల చమురు కోసం ఇండియన్ ఆయిల్(ఐఓసీ) ప్రారంభ బిడ్లను ఆహ్వానించింది. ప్రస్తుతం భారత ముడి చమురు దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచి వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సగటున రోజుకు 17 లక్షల బ్యారెళ్ల చమురును మనం దిగుమతి చేసుకున్నాం. ఇందులో అత్యధికం రిలయన్స్, నయారా లాంటి ప్రైవేటు సంస్థలు కొన్నాయి. దీనిపై స్పందించిన రిలయన్స్ సంస్థ, అమెరికా ఆంక్షల తర్వాత మధ్యప్రాచ్యం, అమెరికా, బ్రెజిల్ నుంచి ముడి చమురును కొనుగోలు చేసినట్టు పేర్కొంది.






