Lenskart: ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్

by S Gopi |

ప్రస్తుత వాటాదారులు కూడా 13.23 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

Lenskart: ఐపీఓ కోసం డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కళ్లజోళ్ల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్ ఐపీఓకు సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఐవేర్ రిటైలర్‌గా ఉన్న లెన్స్‌కార్ట్ మార్కెట్ల నుంచి రూ. 8,600 కోట్లను సమీకరించనుంది. ఇందులో రూ. 2,150 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీకి వాటాదారుల నుంచి ఆమోదం పొందింది. తాజాగా తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. కొత్త షేర్ల జారీతో పాటు ప్రమోటర్లుగా ఉన్న ప్రస్తుత వాటాదారులు కూడా 13.23 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ వాటాదారులలో కంపెనీ వ్యవస్థాపకులు పెయూష్ బన్సాల్, నేహా బన్సాల్, అమిత్ చౌదరి సహా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్, ముంబైకి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కెదారా, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ టెమాసెక్ కూడా ఉన్నారు. ప్రధానంగా కంపెనీ తన విస్తరణ, వ్యాపార లక్ష్యాల కోసం ఐపీఓ నిధులను వినియోగించనున్నట్టు వెల్లడించింది. కొత్త స్టోర్ల ఏర్పాటు, టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టుబడులు, ఇతర కార్యకలాపాల కోసం ఉపయోగించనుంది. మోర్గాన్ స్టాన్లీ, కోటక్ మహీంద్రా క్యాపిటల్, యాక్సిస్ క్యాపిటల్ హోల్డింగ్స్, సిటీ సంస్థలు ఈ ఐపీఓ కోసం ప్రధాన బుక్‌రన్నింగ్ మేనేజర్లుగా ఉన్నాయి. కాగా, గతేడాది మార్చి నాటికి కంపెనీ సుమారు రూ. 43 వేల కోట్ల మేర అప్పులున్నాయి.

Next Story