Reciprocal Tariff: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ దెబ్బ.. ఎగుమతుల్లో ఏటా రూ. 60 వేల కోట్ల నష్టం

by S Gopi |

పూర్తిస్థాయిలో ఆర్థిక భారాన్ని అంచనా వేసేందుకు మరికొంత సమయం పడుతుంది.

Reciprocal Tariff: ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ దెబ్బ.. ఎగుమతుల్లో ఏటా రూ. 60 వేల కోట్ల నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలపై చేసిన ప్రకటనతో వాణిజ్య యుద్ధంపై దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సుంకాలు విధించే అవకాశం ఉండటంతో వాహనాల నుంచి వ్యవసాయ రంగం వరకు ఎగుమతుల రంగాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. ఈ అంశంపై సిటీ రీసెర్చ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, పరస్పర సుంకాల వల్ల ఏటా 7 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 60 వేల కోట్ల) నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. పూర్తిస్థాయిలో ఆర్థిక భారాన్ని అంచనా వేసేందుకు మరికొంత సమయం పడుతుంది. సుంకాలు ఏ ప్రాతిపదికన లెక్కిస్తారనే దాన్ని బట్టి ప్రభావం ఉంటుందని ప్రభుత్వాధికారులు ఎదురుచూస్తున్నారు. ట్రంప్ పరస్పర సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అలాగే సుంకాల భారం తగ్గించేందుకు, ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచేందుకు అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రాతిపాదనల కోసం పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా ప్రధానమైన కెమికల్స్, మెటల్ ఉత్పత్తులు, ఆభరణాలు, ఆటోమొబైల్స్, ఫార్మా, ఆహార పదార్థాలు ఎక్కువ ప్రభావితం కానున్నాయి. 2023లో అమెరికా నుంచి భారత్ సగటున 11 శాతం టారిఫ్ వసూలు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా 8.2 శాతం తక్కువ పన్నులను విధిస్తోందని సిటీ రీసెర్చ్ విశ్లేషకులు తెలిపారు. ఒకవేళ అమెరికా ప్రభుత్వం భారత్‌కు చెందిన వస్తువులు, సేవలపై 10 శాతం మేర సుంకాన్ని పెంచితే, దిగుమతులు 11-12 శాతం మేర క్షీణించవచ్చని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

Next Story