Indian Exporters: ఈయూ కార్బన్ ట్యాక్స్‌తో భారతీయ ఎగుమతిదారులకు కొత్త సవాళ్లు

by S Gopi |

యూరోపియన్ పార్లమెంట్ కమిటీ ఈ పన్ను పరిధిని మరింత విస్తరించాలని సిఫార్సు చేసింది.

Indian Exporters: ఈయూ కార్బన్ ట్యాక్స్‌తో భారతీయ ఎగుమతిదారులకు కొత్త సవాళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ యూనియన్(ఈయూ) అమలు చేస్తున్న కార్బన్ ట్యాక్స్ భారతీయ ఎగుమతిదారులు కొత్త సవాళ్లను తెచ్చే అవకాశం ఉంది. కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు అమలు చేస్తున్న ఈయూ కర్బన సరిహద్దు సర్దుబాటు విధానాన్ని(సీబీఏఎం) మరిన్ని రంగాలకు విస్తరించాలని యోచిస్తోంది. 2028, జనవరి నుంచి దీన్ని విస్తృత స్థాయిలో అమలు చేసే అవకాశముంది. కార్బన్ ట్యాక్స్ అంటే ఈయూ దేశాల్లోకి దిగుమతి అయ్యే కొన్ని రకాల వస్తువుల తయారీలో విడుదలయ్యే కర్బన ఉద్గారాల ఆధారంగా విధించే పన్ను. దీని ద్వారా అంతర్జాతీయంగా కాలుష్యాన్ని తగ్గించడం ఈయూ లక్ష్యం. ప్రస్తుతం ఈ పన్ను ఇనుము, ఉక్కు, అల్యూమినియం, సిమెంట్, ఎరువులు, హైడ్రోజన్, విద్యుత్ వంటి భారీ పరిశ్రమలకు మాత్రమే అమలు చేస్తోంది. ఇవి అధిక కాలుష్యం కలిగిన రంగాలు. అయితే, ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ కమిటీ ఈ పన్ను పరిధిని మరింత విస్తరించాలని సిఫార్సు చేసింది. ఇందులో ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, యంత్రాలు, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు వంటి మరిన్ని పారిశ్రామిక రంగాలను చేర్చే అవకాశం ఉంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే భారతీయ ఎగుమతిదారులకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే ఈయూకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు ఖర్చు పెరుగుతుంది, దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ తగ్గే ప్రమాదం ఉంది. భారత్, ఈయూ మధ్య కుదిరిన ఎఫ్‌టీఏ వల్ల సుంకాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సీబీఏఎం కారణంగా భారత ఎగుమతులపై అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడుతుంది.

Next Story