- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: 2032 నాటికి దేశంలో 12 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు
2024 నాటికి దేశవ్యాప్తంగా 76,000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: 2032 నాటికి దేశంలో 12.3 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై ఉంటాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యల నేపథ్యంలో మరింత వేగంగా ఈవీల వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు సానుకూలంగానే ఉన్నాయి. దీనివల్ల 2030 కల్లా 30 శాతం ఈవీలు రోడ్లపై ఉండేందుకు వీలుందని నివేదిక పేర్కొంది. ఇందుకు ప్రభుత్వ ఫేమ్-2 పథకం లాంటి సబ్సిడీ విధానాలు దోహదపడ్డాయి. ఈ పథకం కారణంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్, త్రీ-వీలర్లు, కార్లకు ప్రోత్సాహకాలు అందుతాయని, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సబ్సిడీ అందుతుందని నివేదిక వివరించింది. ప్రభుత్వం నిర్ణయాలతో మరో ఐదేళ్లలో ఈవీల విస్తరణ టూవీలర్, త్రీవీలర్ల విభాగంలో 80 శాతం, కార్ల విభాగంలో 30 శాతం, కమర్షియల్ కార్లలో 70 శాతం, ఈవీ బస్సులలో 40 శాతానికి చేరుకుంటాయి. ప్రస్తుతం దేశంలోని మొత్త ఈవీ వాహనాల్లో టూ-వీలర్, త్రీవీలర్ల వాటాయే 93 శాతం ఉందని, కార్లు 6 శాతం, ఈవీ బస్సులు, ట్రక్కులు 1 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సదుపాయం పెరగడం ద్వారా ఈవీ కార్లు గణనీయంగా పెరుగుతాయని అంచనా. గణాంకాల ప్రకారం, 2024 నాటికి దేశవ్యాప్తంగా 76,000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 1.3 గిగావాట్లు. ఉద్గార లక్ష్యాలను చేరుకోవాలంటే 2032 నాటికి ఇవి 21 లక్షలకు ఛార్జింగ్ పాయింట్లు పెరగాలని నివేదిక పేర్కొంది.






