- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-EU: యూరోపియన్ కార్లపై 40 శాతానికి తగ్గనున్న టారిఫ్
యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలు ఈనెల 27న ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 27 దేశాల ఐరోపా సమాఖ్య నుంచి 15,000 యూరోల కంటే ఎక్కువ (రూ. 16 లక్షలు) ఖరీదైన, పరిమిత సంఖ్యలో కార్లపై పన్నును వెంటనే తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అంగీకరించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు రాయిటర్స్‌కు పేర్కొంది. కాలక్రమేణా దీన్ని 10 శాతానికి తగ్గించనున్నారు. దీనివల్ల ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ వాహన తయారీ కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి. అయితే, ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, చివరి నిమిషంలో మార్పులు ఉండొచ్చని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా, చైనా తర్వాత అమ్మకాల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఉంది. కానీ, దేశీయ ఆటో పరిశ్రమ పటిష్టంగా ఉన్నందున, విదేశీ కార్లకు అత్యధిక పోటీ ఉంటుంది. న్యూఢిల్లీ ప్రస్తుతం దిగుమతి చేసుకున్న కార్లపై 70 శాతం నుంచి 110 శాతం వరకు సుంకాలను విధిస్తోంది. దీనిపై అనేక విదేశీ బ్రాండ్ల కంపెనీల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాహన పరిశ్రమలో మరిన్ని విదేశీ బ్రాండ్లకు అవకాశం కల్పిస్తూ, కేంద్రం ఏడాదికి సుమారు 2,00,000 కార్లపై దిగుమతి సుంకాలను తక్షణమే 40 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిందని సమాచారం.






