Economy: వచ్చే 5 ఏళ్లలో భారత్ 6-8 శాతం వృద్ధిని కొనసాగిస్తుంది: అశ్విని వైష్ణవ్

by S Gopi |

ఇందుకు ప్రధానంగా తక్కువ ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి మద్దతిస్తాయని మంత్రి తెలిపారు.

Economy: వచ్చే 5 ఏళ్లలో భారత్ 6-8 శాతం వృద్ధిని కొనసాగిస్తుంది: అశ్విని వైష్ణవ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రాబోయే ఐదేళ్ల వరకు భారత ఆర్థికవ్యవస్థ వాస్తవ గణాంకాల్లో 6-8 శాతం, నామమాత్రంలో ఈ వృద్ధి 10-13 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇందుకు ప్రధానంగా తక్కువ ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి మద్దతిస్తాయని మంత్రి తెలిపారు. ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా పరిశ్రమల సంఘం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి.. భారత్‌లో వ్యాపారం చేయడం సులభతరం అవుతోంది. ప్రభుత్వ అనుమతులను సరళీకృతం చేస్తున్నట్లు చెప్పారు. ఉదాహరణకు టెలికాం టవర్‌ను ఏర్పాటు చేయడానికి పట్టే సమయం 270 రోజుల నుంచి కేవలం 7 రోజులకు తగ్గిందని, చాలా అనుమతులు ఇప్పుడు తక్షణమే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రణాళికలకు, వాటి వాస్తవ అమలుకు మధ్య అంతరం ఉందని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వ అధికారులు విధాన నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసేలా చూడాల్సి ఉందన్నారు. పరిశ్రమలు తమ సమస్యలను బహిరంగంగా పంచుకోవాలని కోరారు. అమెరికా, యూరప్ వంటి దేశాల స్థాయిలో డేటా నిల్వ నిబంధనలను రూపొందించాల్సిన అవసరాన్ని మంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో 2047 నాటికి మనదేశ తలసరి ఆదాయాన్ని కనీసం ఐదు రెట్లు పెంచుకోవాలి. దీన్ని సాధించడానికి, భారత్ మధ్యప్రాచ్యం, ఆసియా-పసిఫిక్, యూకే వంటి ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను విస్తరిస్తోంది. కార్మిక, జీఎస్టీ వంటి సంస్కరణలు ఇందుకు సహకారం అందిస్తాయని వెల్లడించారు.

Next Story