- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: రూపాయికి ఆర్‌బీఐ 'స్వాప్' కవచం
మే 26న మూడు సంవత్సరాల కాలపరిమితితో 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్/రూపాయి కొనుగోలు-అమ్మకం స్వాప్ వేలాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ కరెన్సీ రూపాయి పతనాన్ని నిలువరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక చర్యలకు దిగింది. గత కొన్ని సెషన్లుగా రూపాయి విలువ కొత్త రికార్డు కనిష్టాలను నమోదు చేస్తోంది. దీంతో రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు, అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను నిలబెట్టేందుకు సిద్ధమైంది. మే 26న మూడు సంవత్సరాల కాలపరిమితితో 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్/రూపాయి కొనుగోలు-అమ్మకం స్వాప్ వేలాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఆర్‌బీఐ విదేశీ మారక మార్కెట్లో డాలర్లు అమ్మినప్పుడు మార్కెట్ నుంచి రూపాయలు బయటకు వెళ్తాయి. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గి, వడ్డీ రేట్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని సమతుల్యం చేయడానికే ఇప్పుడు స్వాప్ వేలాన్ని ఉపయోగిస్తోంది. ఈ స్వాప్ ద్వారా ఆర్‌బీఐ తాత్కాలికంగా మార్కెట్లో రూపాయి లిక్విడిటీని అందిస్తుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, ముడిచమురు ధరల పెరుగుదల వల్ల రూపాయి విలువ రికార్డు స్థాయిలో క్షీణించిన నేపథ్యంలో మరింత పతనం కాకుండా ఈ స్వాప్ పద్దతి దోహదపడుతుంది.
'స్వాప్' వేలం
సులభంగా చెప్పాలంటే, ఇది ఒక తాత్కాలిక లావాదేవీ. ఆర్‌బీఐ ఇప్పుడు మార్కెట్ నుంచి డాలర్లను తీసుకుని, దానికి బదులుగా బ్యాంకులకి రూపాయిలను ఇస్తుంది (3 ఏళ్ల కాలపరిమితితో). దీనివల్ల బ్యాంకుల దగ్గర రూపాయిల నిల్వలు పెరుగుతాయి. గడువు తర్వాత ఇప్పుడు అమ్మిన డాలర్లను బ్యాంకుల నుంచి కొనుగోలు చేసేలా ఒప్పందం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఆర్‌బీఐ డాలర్లను అమ్ముతుండటంతో మన మార్కెట్లో రూపాయిలు తగ్గిపోయాయి. ఆ కొరతను తీర్చడమే ఈ స్వాప్ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత ఉండదు. ఈ నిర్ణయం కేవలం రూపాయికే పరిమితం కాకుండా, బాండ్ మార్కెట్లపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. ఈ స్వాప్ వల్ల ద్రవ్య లభ్యత మెరుగుపడటంతో, బుధవారం బాండ్ల దిగుబడి తగ్గింది. ఇది ప్రభుత్వానికి, పరిశ్రమలకు తక్కువ వడ్డీకే అప్పులు లభించేలా చేస్తుంది. హెడ్జింగ్ ఖర్చులు తగ్గడం వల్ల వ్యాపారాలకు, ముఖ్యంగా దిగుమతులు చేసుకునే కంపెనీలకు ఇది పెద్ద ఊరట.






