- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Exporters: పశ్చిమాసియా ఎగుమతిదారులకు కేంద్రం హామీ
రిలీఫ్ పథకం కింద దేశ ఎగుమతులను స్థిరంగా ఉంచడం, ఆ ప్రాంతంలో మార్కెట్ వాటాను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఎగుమతిదారులకు సహాయం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా, బీమా ఖర్చుల భారం పెరగడంతో ఎగుమతిదారులకు రూ. 497 కోట్ల సహాయ పథకాన్ని గురువారం ప్రకటించింది. రెజిలెన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ (రిలీఫ్) పథకం కింద దేశ ఎగుమతులను స్థిరంగా ఉంచడం, ఆ ప్రాంతంలో మార్కెట్ వాటాను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే సరుకుల రవాణాకు గ్లోబల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కవరేజీని ఉపసంహరించుకున్నాయి. ఇదే సమయంలో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎగుమతిదారులకు సహాయంగా, ఈ పథకం మూడు రకాల మద్దతును అందిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే ఈసీజీసీ-ఇన్సురెన్స్ ఉన్న ఎగుమతిదారుల (ఫిబ్రవరి 14–మార్చి 15)కు సాధారణ బీమాకు మించి యుద్ధ, రాజకీయ నష్టాల కింద రూ. 56 కోట్ల అదనపు పరిహారం ఇస్తారు. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్, యెమెన్‌లకు కొత్త సరుకుల రవాణా (మార్చి 16–జూన్ 15) చేసే ఎగుమతుల మద్దతు కింద రూ. 159 కోట్లు, ఈసీజీసీ బీమా లేని ఎంఎస్ఎంఈలకు ఆయా దేశాలకు చేసే అదనపు రవాణాపై 50 శాతం రియంబర్స్‌మెంట్, బీమా ఖర్చుల మద్దతు కింద రూ. 282 కోట్ల సాయం అందించనున్నారు. పశ్చిమాసియాలో పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఎగుమతిదారుల సమస్యలను త్వరితగతిన స్పందిస్తోందని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వెల్లడించారు.






