- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: భారత ఆర్థికవ్యవస్థకు తిరుగులేదు
ప్రభుత్వం మూలధన వ్యయాలను కొనసాగించడం వల్ల వృద్ధికి ఢోకా లేదని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగే అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో పేర్కొంది. ప్రైవేట్ వినియోగం మెరుగుపడటం, పటిష్టంగా బ్యాంకు, కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండటం, ప్రభుత్వం మూలధన వ్యయాలను కొనసాగించడం వల్ల వృద్ధికి ఢోకా లేదని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. గురువారం ఆర్‌బీఐ విడుదల నివేదిక ప్రకారం, 2025-26లో భారత్ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. ఇతర దేశాలతో పోలిస్తే స్థిరమైన, అత్యంత వేగంగా భారత వృద్ధి సాధ్యమవుతుంది. ఇటీవలే భారత జీడీపీ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించిన వేళ ఆర్‌బీఐ వార్షిక నివేదిక మరింత ఉత్సాహాన్నివ్వనుంది.
ఇదే సమయంలో అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సమస్యలు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు. ప్రపంచ సరఫరాలో ఒత్తిళ్లు, వినియోగ వస్తువుల ధరలు తగ్గడం, నైరుతి రుతుపవనాల కారణంగా వ్యవసాయ రంగం సానుకూలంగా మారడం వల్ల వచ్చే ఏడాది ద్రవ్యోల్బణ మెరుగ్గా ఉంటుందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది.
డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శం
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భారత్ ప్రపంచానికే ఆదర్శంగా ఉందని ఆర్‌బీఐ తెలిపింది. డిజిటల్ చెల్లింపుల్లో లీడర్‌షిప్ హోదాను భారత్ కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపులలో భారత్ వాటాయే 48.5 శాతంగా ఉంది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉండటం, ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలు ఈ ధోరణిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తాయని ఆర్‌బీఅ వెల్లడించింది.
తయారీ రంగం భేష్
2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా ఇందుకు దోహదపడతాయని ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ విధానాల మూలంగా ఆర్థిక మార్కెట్లలో కొంత అస్థిరతలు తప్పవు. కానీ, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్, మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వాణిజ్య ఒప్పందాలు కీలకం
భారత్ ఇప్పటికే పలు దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. మరికొన్ని దేశాలతో త్వరితగతిన పూర్తయ్యే ప్రయత్నాలు చేస్తోంది. వాటిలో అమెరికాతో పాటు ఒమన్, పెరూ, ఈయూ దేశాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు ఖరారైతే ఆర్ధిక వృద్ధికి దోహదపడనున్నాయి. ఇప్పటికే భారత్ 14 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, 6 ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వామ్యం కలిగి ఉంది. గతేడాది ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉంది.






