- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mukesh Ambani: సంపన్నుల జాబితాలో అంబానీయే టాప్
బిలియనీర్లతో పాటు ఈ జాబితాలో రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు 1,687 మంది ఉన్నారని నివేదిక తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని సంపన్నులకు సంబంధించి ఎం3ఎం హురున్ ఇండియా బుధవారం రిచ్ లిస్ట్-2025 విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత్ మొత్తం 358 మంది బిలియనీర్లతో కొత్త రికార్డును సృష్టించింది. ఈ ఏడాదిలో కొత్తగా 24 మంది బిలియనీర్ల లిస్టులో చోటు సంపాదించారు. బిలియనీర్లతో పాటు ఈ జాబితాలో రూ. 1,000 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు 1,687 మంది ఉన్నారని నివేదిక తెలిపింది. దేశంలోని మొత్తం సంపన్నుల సంపద విలువ రూ. 167 లక్షల కోట్లు ఉంటుంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. ఎక్కువమంది సంపన్నులతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ఈ డేటా దేశంలో ధనవంతులు సంఖ్య, వారి సంపద రెండింటిలోనూ పెరుగుతున్న ధోరణిని సూచిస్తుంది.
అంబానీయే టాప్
దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ టాప్‌లో కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ. 9.55 లక్షల కోట్లు ఉండగా, రెండో స్థానంలో రూ. 8.15 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ కుటుంబం ఉంది. హెచ్‌సీఎల్‌టెక్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా రూ. 2.84 లక్షల కోట్లతో టాప్-3లో ఉన్నారు. వీరి తర్వాత తొలి 10 స్థానాల్లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావా, ఆదిత్య బిర్లాకు చెందిన కుమార మంగళం బిర్లా, నెరజ్ బజాజ్, దిలీప్ సంఘ్వి, అజీమ్ ప్రేమ్‌జీ, గోపీచంద్ హిందూజా, రాధాకిషన్ దమానీ ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ సైతం రూ.12,490 కోట్లతో ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
అత్యంత సంపన్న మహిళగా రోష్నీ నాడార్
ఈ జాబితాలో దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో హెచ్‌సీఎల్ టెక్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. ఆమె రూ. 2.84 లక్షల కోట్లుగా నివేదిక పేర్కొంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 10 మంది సంపన్నుల్లో ఆమె అతి పిన్న వయస్కురాలిగా కూడా ఉన్నారని ఎం3ఎం హురున్ ఇండియా నివేదిక పేర్కొంది.
నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు
* భారత్ రోజుకు రూ. 1,991 కోట్ల సంపదను సృష్టిస్తోంది.
* గత రెండేళ్లుగా దాదాపు ప్రతి వారం ఒక కొత్త బిలియనీర్ జాబితాలో చేరుతున్నారు.
* కొత్తగా జాబితాలో చేరిన వారిలో ఏఐ కంపెనీ పర్‌ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్(31 ఏళ్లు) రూ. 21,190 కోట్లతో దేశంలోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా ఉన్నారు.
* జెప్టో నుంచి కైవల్య వోహ్రా (22), ఆదిత్ పలిచా (23) ఇతర యువ బిలియనీర్లు ఉన్నారు.
* మొత్తం సంపదలో టాప్-10లో ఉన్నవారు మాత్రమే 27 శాతం నియంత్రిస్తున్నారు. అంబానీ, అదానీల వాటాయే 12 శాతం ఉండటం గమనార్హం.






