Oil Reserves: కొత్తగా మరో మూడు చమురు నిల్వలను నిర్మించే యోచనలో కేంద్రం

by S Gopi |

భౌగోళిక రాజకీయ సంక్షోభం వల్ల ఏర్పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముడిచమురు నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది

Oil Reserves: కొత్తగా మరో మూడు చమురు నిల్వలను నిర్మించే యోచనలో కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యపరమైన సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతికూల పరిణామాలు ఎదురైతే ముడిచమురు సమస్య తలెత్తకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో నిల్వలను పెంచుకునేందుకు, ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు వ్యూహాత్మక చమురు నిల్వలను నిర్మించాలని భావిస్తోంది. దానికోసం అనువైన ప్రదేశాలను అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగదారు అయిన భారత్, చమురు అవసరాల్లో 80 శాతం కంటే ఎక్కువ చమురును దిగుమతి చేసుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం వల్ల ఏర్పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముడిచమురు నిల్వలను పెంచుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కొత్త నిల్వలను నిర్మించడానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోందని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ సీఈఓ ఎల్ఆర్ జైన్ రాయిటర్స్‌తో అన్నారు. ప్రస్తుతం మనకు దక్షిణాదిలో మూడు చోట్ల- మంగళూరు, పాదూర్, వైజాగ్ - వద్ద పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. దేశంలో ముడిచమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే వీటిని ఉపయోగిస్తారు.

దక్షిణాదిలో మూడుచోట్ల

వీటికి అదనంగా రాజస్థాన్‌లోని బికనీర్‌లో 52-53 లక్షల టన్నులతో, దక్షిణ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో 17.5 లక్షల టన్నులతో కూడిన సదుపాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని బినాలో కూడా మరొక నిల్వను ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతోందని, ఇక్కడ ఎంత సామర్థ్యం నిల్వ చేయాలనే దానిపై నిర్ణయం జరగలేదని ఎల్ఆర్ జైన్ తెలిపారు. సాధ్యాసాధ్యాల అధ్యయనాల తర్వాత, ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం అవసరం. ప్రభుత్వం 90 రోజుల నిల్వల కోసం చూస్తోంది. దేశంలో ఇంధన డిమాండ్ కూడా పెరుగుతోంది, కాబట్టి అదనపు నిల్వలు అవసరమని పేర్కొన్నారు.

Next Story