- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EVs: అమెరికాను దాటేసిన భారత ఈవీ మార్కెట్
దేశీయంగా అమ్ముడైన కొత్త కార్లలో ఈవీ కార్ల వాటా 5.8 శాతానికి చేరుకోవడం ద్వారా తొలిసారిగా అమెరికాను అధిగమించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) మార్కెట్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఏప్రిల్ నెలలో దేశీయంగా అమ్ముడైన కొత్త కార్లలో ఈవీ కార్ల వాటా 5.8 శాతానికి చేరుకోవడం ద్వారా తొలిసారిగా అమెరికాను అధిగమించింది. వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం, మార్చిలో ఈ వాటా 5.1 శాతంగా ఉంటే, గతేడాది ఇదే సమయంలో 3.7 శాతం మాత్రమే ఉంది. కొత్త మోడళ్లు లాంచ్ కావడం, పెరుగుతున్న వినియోగదారుల ఆసక్తి, ఇంధన ధరల భయాలు భారత మార్కెట్లో ఈవీల అమ్మకాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అమెరికాలో బ్యాటరీ ఈవీ అమ్మకాల వాటా ప్రస్తుతానికి 5.1 శాతానికి పడిపోవడం గమనార్హం. అయితే మొత్తం అమ్మకాల పరిమాణంలో మాత్రం అమెరికా ఇప్పటికీ మనదేశం కంటే ముందంజలోనే ఉంది. ఏప్రిల్‌లో దేశీయంగా సుమారు 23,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా, అమెరికాలో ఈ సంఖ్య 70,000 దాటింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్‌తో పోలిస్తే అమెరికా మార్కెట్ పరిమాణం దాదాపు మూడు రెట్లు పెద్దది కావడం ఇందుకు కారణం. అమెరికాలో టెస్లా ఈవీ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తుండగా, తర్వాత స్థానాల్లో జనరల్ మోటార్స్, ఫోర్డ్, హ్యూండాయ్ ఉన్నాయి.
మన మార్కెట్లో మాత్రం టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఏప్రిల్‌లో కంపెనీ 8,543 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి, గతేడాదితో పోలిస్తే 92 శాతం వృద్ధిని నమోదు చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా 5,413 యూనిట్లతో రెండో స్థానంలో ఉండగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 5,006 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినియోగదారులను ఈవీల వైపు మళ్లిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఈవీ డిమాండ్ 20-25 శాతం పెరిగిందని టాటా మోటార్స్ వెల్లడించింది.






