EVs: లగ్జరీ ఈవీలపై జీఎస్టీ పెంచే యోచనలో ప్యానెల్

by S Gopi |

ప్రజలు దేశీయ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు.

EVs: లగ్జరీ ఈవీలపై జీఎస్టీ పెంచే యోచనలో ప్యానెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి బుధవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మొదలు కానుంది. ఈ సమావేశంలో 46,000 డాలర్ల(రూ. 40 లక్షలకు పైన) ఖరీదైన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల(ఈవీ)పై భారీ సుంకాలను పెంచాలని ప్యానెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల టెస్లా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ పన్ను వ్యవస్థను సంస్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధిక సుంకాల కారణంగా అమెరికాతో సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రజలు దేశీయ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. అందుకోసం షాంపూల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిదీ చౌకగా లభించేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో శ్లాబుల సంఖ్యలను రెండుకు తగ్గించారు. ఈ క్రమంలోనే జీఎస్టీ కౌన్సిల్ ప్రధాని మోడీ సూచనలకు అనుగుణంగా అనేక వస్తువులపై జీఎస్టీలో కోతకు అంగీకరించింది. అయితే, దీన్ని భర్తీ చేసేందుకు ఈవీ కార్లపై పన్నులను పెంచాలని సిఫార్సు చేసింది. అందులో భాగంగా రూ. 20-40 లక్షల మధ్య ఉన్న ఈవీలపై ప్రస్తుతం 5 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని సూచించింది. అలాగే, రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈవీలపై 28 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. లగ్జరీ కార్లను ఉన్నత వర్గాలే కొనుగోలు చేస్తాయని, కంపెనీలు సైతం వాటిని దేశీయంగా తయారు చేయకుండా ఎక్కువగా దిగుమతి చేసుకుంటాయని వివరించింది. కానీ, ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించాలని నిర్ణయించడంతో ఈవీలపై పన్నును 18 శాతానికే పరిమితం చేయాల్సి ఉంటుంది. లేదా లగ్జరీ వస్తువుల కోసం సూచించిన 40 శాతం పన్ను పరిధిలోకి చేర్చాల్సి ఉంటుంది. ఈ అంశాలను జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Next Story