- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aviation Industry: మన విమానయాన సంస్థలను వెంటాడుతున్న కష్టాలు
ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి

దిశ, బిజినెస్ బ్యూరో: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిర్ డెక్కన్, పారామౌంట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ అనేవి ఒకప్పుడు దేశీయ విమానయాన రంగంలో ఎక్కువగా విన్న పేర్లు. వీటిలో కొన్ని సంస్థలు లగ్జరీ, కొన్ని చౌక ఛార్జీలతో సేవలందించాయి. మరికొన్ని చిన్న నగరాలకూ సర్వీసులను అందించాయి. కొంతకాలం పాటు ఈ సంస్థలు వేగంగా విస్తరించడమే కాకుండా పూర్తిస్థాయిలో విమానాలను నడిపాయి. కానీ, ఆ తర్వాత, ఒక్కొక్కటిగా నగదు కొరత, నియంత్రణ ఇబ్బందుల్లో పడ్డాయి. కొన్ని సంస్థలు స్వంత సమస్యలతో కూలిపోయాయి. ఆయా సంస్థలు ఆకస్మికంగా మూతబడలేదు. అవి నెమ్మదిగా కనుమరుగయ్యాయి. ఇటీవల ఇండిగో సంక్షోభం కూడా అలాంటిదే. పైలట్ల కొరత, నిర్వహణ సమస్యలు అంటూ ఇండిగో రోజుకు 100-150 చొప్పున కొన్నిరోజుల పాటు విమాన సర్వీసులను నిలిపేసింది. ఈ పరిణామాలు మనదేశంలో ఎయిర్‌లైన్ వ్యాపారం ఎంత కఠినమో రుజువు చేశాయి.
మరింత సూటిగా చెప్పాలంటే మనదేశంలో ఎయిర్‌లైన్‌ను ప్రారంభించడం కూడా కష్టమే అనిపించాయి. ఎందుకంటే, ప్రభుత్వం నుంచి అనుమతులు మొదలుకొని దాన్ని విజయవంతంగా కొనసాగించడం వరకు అనేక సవాళ్లను విమానయాన సంస్థలు అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటి అయినప్పటికీ, ఇక్కడ ఎయిర్‌లైన్‌ను నడపడం అత్యంత కష్టతరమైన వ్యాపారాలలో ఒకటిగా మారింది. తాజా ఇండిగో సంక్షోభం తర్వాత కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్తగా 3 ఎయిర్‌లైన్స్‌కు అనుమతిచ్చింది. సంక్షోభ సమయంలో ఈ సంస్థలు కొంత ఉపశమనం కల్పిస్తాయని చెప్పవచ్చు. అయితే, మనదేశంలో ఎయిర్‌లైన్స్ నిర్వహణ ఎందుకింత క్లిష్టంగా మారింది, ఎందుకనీ పుట్టుకొస్తున్న సంస్థలు ఒక్కొటీ మూతపడుతున్నాయి? ఇలాంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!
దేశ విమానయాన వృద్ధి, వైరుధ్యాలు
మనదేశంలో ఇప్పుడు దేశీయ విమానయాన ప్రయాణీకుల రద్దీ ఏటా 20 కోట్లు దాటింది. నవీ ముంబై, జెవార్, గోవా సహా అనేక ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాలు వస్తున్నాయి. మన విమానయాన సంస్థలు 1,900 కంటే ఎక్కువ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి, ఇది భవిష్యత్ డిమాండ్‌పై విశ్వాసానికి రుజువు. అయినప్పటికీ, ఈ వృద్ధి విమానయాన సంస్థల ఆర్థిక స్థిరత్వానికి దోహదపడటంలేదు. గత మూడు దశాబ్దాల్లో దేశంలో డజన్ల కొద్దీ విమానయాన సంస్థలు మూతబడ్డాయి.
ప్యాసింజర్లు, తక్కువ మార్జిన్లు
సాధారణంగా భారత్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. అంటే, ప్రతీది ఖర్చు ఆధారంగానే మన ప్రజల నిర్ణయాలు ఉంటాయి. దీనివల్లే విమానయాన సంస్థలు పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ, మార్జిన్లు చాలా తక్కువగా ఉంటాయని బీటీజీ అద్వయ పార్ట్‌నర్ మాన్షి సింగ్ అన్నారు. గత 15 నుంచి 20 ఏళ్లలో విమానయాన రంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ, చాలామంది రైళ్లలోనే ప్రయాణిస్తారు. ఎక్కువ మంది ప్రయాణీకులకు ఇప్పటికీ విమాన ప్రయాణం ఖరీదుతో కూడుకున్నది, అందుకే ప్రయాణాలకు రైళ్లను ఎంచుకుంటారని సీనియర్ విమానయాన రంగ విశ్లేషకులు అమిత్ మిట్టల్ అన్నారు.
అధిక నిర్వహణ ఖర్చులు, ఏటీఎఫ్ భారం
భారతీయ విమానయాన సంస్థలకు ఇంధనం మరో అతిపెద్ద ఖర్చుగా ఉంటుంది. దేశంలో విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులలో ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్) దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఏటీఎఫ్‌పై భారత్ అత్యధిక పన్నులను విధిస్తుండటం దీనికి కారణం. సరఫరా, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మారకపు రేటు హెచ్చుతగ్గుల వల్ల కలిగే అస్థిరత అధిక పన్నులను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎయిర్‌లైన్స్ టికెట్ ధరల ద్వారా ప్రయాణీకులపై వేయక తప్పదు. ఇది కాకుండా విమానయాన సంస్థలు ల్యాండింగ్ ఫీజులు, పార్కింగ్ ఫీజులు, యూజర్ డెవలప్‌మెంట్ ఛార్జీలను చెల్లిస్తాయి. ఈ ఖర్చులలో కొన్ని ప్రయాణీకులకు బదిలీ చేయనప్పటికీ, అవి ధరలను ప్రభావితం చేస్తాయి, తద్వారా లాభదాయకతను తగ్గిస్తాయి.
డాలర్-రూపాయి
దేశీయ విమానయాన సంస్థల ప్రధాన బలహీనత కరెన్సీ. చాలా విమానయాన ఖర్చులు డాలర్ ఆదారంగా ఉంటాయి. లీజు అద్దెలు, నిర్వహణ ఖర్చులు, ఇంధనం, బీమా కోసం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి బలహీనత నేరుగా విమానయాన సంస్థల బ్యాలెన్స్ షీట్లను ప్రభావితం చేస్తాయి. కొన్ని సంస్థలు అంతర్జాతీయ మార్గాల ద్వారా డాలర్లు సంపాదిస్తున్నప్పటికీ, అవి కూడా పరిమితంగానే ఉన్నాయి. చాలా భారతీయ విమానయాన సంస్థలు ఇప్పటికీ ఎక్కువగా దేశీయ రూట్లలోనే విమానాలు నడుపుతున్నాయి. వారి డాలర్ ఆదాయాలు లీజు అద్దెలను పూర్తిగా కవర్ చేయడానికి సరిపోవు, ముఖ్యంగా ప్రతి సంవత్సరం రూపాయి విలువ 2 నుంచి 5 శాతం తగ్గుతున్న నేపథ్యంలో ఇది వారికి మరింత భారం.
ఒకటి రెండు సంస్థలే ఎందుకు?
ఎప్పటినుంచో భారత విమానయాన మార్కెట్ ఒకటి లేదా రెండు పెద్ద సంస్థలతోనే కొనసాగుతూ ఉంటోంది. అధిక ఖర్చులు, తక్కువ మార్జిన్లు ఉన్న సంస్థలు మనుగడ కోసం కష్టపడతాయి. చివరికి, బలహీనమైన విమానయాన సంస్థలు కుప్పకూలగా, పెద్ద విమానయాన సంస్థలు వాటి రూట్లు, స్లాట్లు, మార్కెట్ వాటాను సొంతం చేసుకుని కొనసాగుతాయి.
ప్రభుత్వ మద్దతు, సవాళ్లు
ప్రభుత్వ విధానాలు విమానయాన వృద్ధికి విస్తృతస్థాయిలో మద్దతిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉడాన్ వంటి పథకాలు కొత్త ప్రాంతీయ విమానయాన మార్గాలను తెరవడమే కాకుండా కనెక్టివిటీని మెరుగుపరిచాయి.
అయినప్పటికీ, సవాళ్లు అలాగే ఉన్నాయి. జీఎస్టీకి బదులుగా రాష్ట్ర వ్యాట్ కింద ఏటీఎఫ్‌పై పన్ను విధిస్తున్నారు. బ్యాంకుల నుంచి లభించే విమాన ఫైనాన్సింగ్ కూడా పరిమితంగానే ఉంది. ఇవే కాకుండా పైలట్లు, ఇంజనీర్ల కొరత, విమాన తయారీ కంపెనీల నుంచి సరఫరా వంటి కొత్త సవాళ్లు కూడా ఉన్నాయి.
భారత్‌కు మరింత స్థిరమైన విమానయాన సంస్థలను తెచ్చేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం. వీటిలో స్థిరమైన లీజింగ్ చట్టాలు, ఫైనాన్సింగ్ సౌకర్యం, ఖర్చు హేతుబద్ధీకరణ, మెరుగైన స్లాట్ నిర్వహణ, నియంత్రణ పర్యవేక్షణ ముఖ్యం. ఈ మార్పులు చేపట్టకపోతే భారత్‌లో విమానయాన సంస్థలు వేగంగా పెరగడం మరియు అంతే త్వరగా పడిపోవడం కొనసాగవచ్చు.






